హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు శుక్రవారం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావుగౌడ్ తదితర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోయారు.
పార్టీ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పలువురు అభ్యర్థిత్వాలపై లోతుగా పరిశీలించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే సానుకూల ఫలితం వస్తుంది? దానికి సరైన అభ్యర్థి ఎవరు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు.. వంటి పలు అంశాలపై అన్ని కోణాల్లో చర్చించారు. సమావేశానికి హాజరుకాలేకపోయిన మాజీ మంత్రి తలసానితో సైతం కేసీఆర్ ఫోన్లో మాట్లాడి ఆయన అభిప్రాయాన్ని కూడా సేకరించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్‌కే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఖరారు చేయడంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం టికెట్ ఖరారు చేస్తూ ప్రకటన రాగానే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు యూసుఫ్‌గూడలోని పార్టీ కార్యాలయం వద్ద పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. గోపన్న జిందాబాద్.. అని నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుని సంబురాల్లో పాల్గొన్నాయి. వెంగళ్రావునగర్ కార్పొరేటర్ దేదీప్యరావు, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తోపాటు వివిధ డివిజన్ల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మాగంటి సునీతా గోపీనాథ్‌కు అభినందనలు తెలియజేశారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ తెలిపారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, నియోజకవర్గ ప్రజలే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత తనకు టికెట్ ఇచ్చి అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. ఎన్టీఆర్ తరువాత తనకు అత్యంత అభిమాన నాయకుడు కేసీఆర్ అని గోపీనాథ్ చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.