పెద్దపల్లి, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ‘నాడు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించింది. నేడు ప్రజల మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నది’ అంటూ రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకొనే పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. గురువారం పెద్దపల్లిలోని ఓ కల్యాణమండపంలో పెద్దపల్లి జిల్లాలోని 500 మంది ఐకేపీ వీవోఏలు, మెప్మా సిబ్బంది మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరగా మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోరాట ఫలితంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమస్ఫూర్తితో పాలన సాగిస్తున్నదన్నారు. ఏడేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలో ముందువరుసలో నిలిచిందన్నారు. వెనుకబడ్డ, ఆకలిచావుల ప్రాంతం అనే నానుడిని తుడిచివేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఎంతగానో పరితపిస్తున్నారని కొనియాడారు. ఐటీ, ఇతర పరిశ్రమలు తెచ్చిందన్నారు. ఉద్యోగులను ఆదుకున్నదని చెప్పారు. జగిత్యాల జిల్లాలో మాదిరిగా మహిళలు ‘సహజ’ బ్రాండ్ వస్తువులను తయారు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్, వీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ముచ్చేందర్, ఉపాధ్యక్షురాలు భూలక్ష్మి, కోశాధికారి రమాదేవి, సహాయ కార్యదర్శి ఖలీం తదితరులు పాల్గొన్నారు.