కరీంనగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్ : రాష్ట్రంలో 2017 జూన్ 3న ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో ప్రసవాలకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పించింది. ఈ పథకం ప్రవేశ పెట్టక ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రసవం కోసం ఎక్కువగా ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లేవి. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించే పరిస్థితి ఉండేది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాలో అయితే నెలకు కేవలం 150 నుంచి 200 ప్రసవాలు మాత్రమే అయ్యేవి. పీహెచ్‌సీలను బలోపేతం చేయడం, ఉమ్మడి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక్క ఎంసీహెచ్‌లోనే నెలకు 800 నుంచి 900 ప్రసవాలు జరుగుతున్నాయంటే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై ఎంత నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఎంసీహెచ్‌లో ఏ ప్రైవేట్ దవాఖానలో లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా హై బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ప్రసవానికి వచ్చే గర్భిణులకు సైతం ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతో ఉన్న హై డిఫెండెన్సీ యూనిట్‌ను నెలకొల్పారు. దీనికి అనుబంధంగా ఐసీవో, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశారు. ప్రసవం తర్వాత పిల్లల ఆరోగ్యం కోసం పిడియాట్రిక్ విభాగం నెలకొల్పారు. అంతే కాకుండా టీ హబ్ ఏర్పాటుతో ప్రతి నెలా గర్భిణుల పరీక్షలకు ఇబ్బందులు తొలిగాయి. పూర్తి ఉచితంగా హై క్వాలిటీ మిషన్లపై పరీక్షలు నిర్వహిస్తూ సరాసరి నివేదికలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల గర్భిణులు తమ బిడ్డలకు సురక్షితంగా జన్మనిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 38,608 ప్రసవాలు జరిగాయి. ఇందులో మొదటి రెండు కాన్పులు జరిగిన 34వేల మందికి పైగా కేసీఆర్ కిట్లు అందుకున్నారు.
తల్లీ బిడ్డల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా ‘కేసీఆర్ కిట్’తో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే కాకుండా, నిరుపేదలకు ఈ పథకం భరోసానిస్తున్నది. రూ.2 వేల విలువగల 16 రకాల వస్తువులు ఉండే ఈ కిట్‌ను ప్రసవం జరిగిన తర్వాత 24 గంటల్లోపే అందిస్తుండడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు కూడా ఈ పథకం కింద ఇస్తున్నారు.
సంతోషంలో నిఖిల
.. ఈమె పేరు మోటాటి నిఖిల. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లికి చెందిన ఈమె కూడా మొదటి కాన్పు కోసం కరీంనగర్‌లోని ఎంసీహెచ్‌కు వచ్చింది. కొద్ది రోజుల కింద ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం అత్యవసరమై శస్త్ర చికిత్స చేశారు. ఇదే శస్త్ర చికిత్స ద్వారా ప్రైవేట్ దవాఖానలో ప్రసవం జరిగితే తమ పరిస్థితి వేరేగా ఉండేదని, ఇక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారని నిఖిల చెబుతోంది. మరుసటి రోజే తమకు కేసీఆర్ కిట్ ఇచ్చారని సంతోష పడుతున్నది.
ప్రైవేట్‌కు మించి సేవలు
కరీంనగర్ ఎంసీహెచ్ ప్రభుత్వ దవాఖాన అంటే నమ్మబుద్ది కావడం లేదని అంటోంది గొల్లపల్లి ప్రశాంతి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన ప్రశాంతి ఐదు రోజుల కింద ప్రసవం కోసం ఎంసీహెచ్‌లో చేరింది. మొదటి కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రశాంతి తనలాంటి ఎందరికో ఇక్కడ పైసా ఖర్చు లేకుండా ప్రసవాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అంటున్నది. ప్రభుత్వ వైద్యులపై నమ్మకం పెరగడంతో ఉన్నోళ్లు, లేనోళ్లు కూడా ఇక్కడికే వస్తున్నరని చెబుతోంది. ఈ దవాఖానలో బెడ్స్, పరిసరాలు చాలా నీట్‌గా ఉన్నాయని, ప్రైవేట్ దవాఖానల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో లక్ష దాటిన పంపిణీ
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశ పెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం ఉమ్మడి జిల్లాలో మంచి ఫలితాలను అందిస్తోంది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శస్త్ర చికిత్సల ద్వారానే ఎక్కువగా కాన్పులు జరిగేవి. తల్లుల కడుపు కోతల్లో ఆసియా ఖండంలోనే మొదటి స్థానంలో ఉండేది. కేసీఆర్ కిట్స్ ప్రవేశ పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ దవాఖానాల్లో అవసరమైతేగానీ శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు చేయడం లేదు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రసవాలు జరుగగా, ఇందులో 50 శాతం సాధారణ ప్రసవాలేనని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్లో 42,246, జగిత్యాలలో 30,655, పెద్దపల్లిలో 18,788, రాజన్న సిరిసిల్లలో 12,886 ప్రసవాలు జరిగాయి. ప్రసవాలకు ప్రత్యేకంగా నెలకొల్పిన ఎంసీహెచ్ల్లోనే కాకుండా ప్రభుత్వ ప్రధాన దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానాల్లోనూ నెల నెలా పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి.
కేసీఆర్ కిట్స్‌తో ప్రయోజనాలు
కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత ప్రసవాల విషయంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రసవించిన 24 గంటల్లో తల్లులకు కేసీఆర్ కిట్ అందుతోంది. ఇందులో తల్లికి, శిశువుకు అవసరమయ్యే 16 రకాల వస్తువులు ఉంటాయి. సబ్బులు, షాంపు, నూనె, పౌడర్, చిన్న బెడ్, దోమ తెర, రెండు బేబీ డ్రెస్సులు, తల్లికి రెండు చీరలు, టవల్స్, మదర్ సోప్స్, డ్రై షీట్, ఆడుకునే గజ్జె, లంగోటీలు, ఒక బాక్స్ వంటి వస్తువులు ఇస్తారు. ఈ కిట్ విలువ రూ.2 వేల పైనే ఉంటుంది. కాగా, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు కూడా ఈ పథకం కింద ఇస్తున్నారు. గర్భందాల్చిన తర్వాత నాలుగు దశల్లో అందిస్తున్నారు. 3 నుంచి 5 నెలల మధ్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లినపుడు రూ.3 వేలు ఇస్తారు. ప్రసవ సమయంలో మగ శిశువు జన్మిస్తే రూ.4 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.5 వేలు అందిస్తారు. రూ.2 వేల విలువైన కిట్‌ను కూడా అందిస్తారు. శిశువుకు 3 నెలల టీకా వేయించినపుడు రూ.2 వేలు, 9 నెలల టీకా వేయించినపుడు రూ.3 వేల చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
రెండోసారి కేసీఆర్ కిట్..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన బోల్ల మౌనిక రెండో కాన్పులో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కేసీఆర్ కిట్ అందుకోవడం ఈమెకు రెండోసారి, రెండేళ్ల కింద మొదటి కాన్పులో బాబు పుట్టినపుడు కూడా తీసుకున్నది. అప్పుడు ఎలా చూసుకున్నారో ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నారని మౌనిక చెబుతున్నది. మొదటి కాన్పప్పుడు కాస్త భయంగా ఉండేదని, ప్రభుత్వ దవాఖాన అంటే శ్రద్ధ తీసుకోరని అనుకున్నానని చెబుతున్న మౌనిక, తనకు బాబు పుట్టినపుడు కలిగిన నమ్మకంతో మరోసారి ఇదే దవాఖానాలో బిడ్డకు జన్మనిచ్చానని చెబుతోంది.
సాధారణ ప్రసవాలను పెంచాం
శస్త్ర చికిత్సల్లో ఒకప్పుడు దేశంలోనే కరీంనగర్ నంబర్ వన్‌గా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ సంఖ్యను 90 శాతం నుంచి 60 శాతానికి తీసుకువచ్చాం. ఇంకా ప్రజలు మంచి రోజులు అని శస్త్ర చికిత్సలకే మొగ్గు చూపుతూ మాపై ఒత్తిడి తెస్తున్నారు. దేశంలోనే మొదటిసారి కరీంనగర్ ఎంసీహెచ్‌లో మిడ్ వైఫరీ కోర్సును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు మాతా, శిశు మరణాలను తగ్గించడం. మొదటి విడుతలో ఎంతో మంది సిబ్బంది నైపుణ్యత సాధించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఇదే కేంద్రంలో మళ్లీ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరిగింది. రానున్న రోజుల్లో ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలే జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. కేసీఆర్ కిట్లతో పాటు ప్రోత్సాహకాలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం కిటకిటలాడుతుంది.
– డాక్టర్ రత్నమాల, దవాఖాన సూపరింటెండెంట్
రూ.లక్ష మిగిలినట్లే..
ఎంత లేదన్నా తమ కుటుంబానికి రూ.లక్ష మిగిలాయని చెబుతోంది పెసరి అనూష. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఈమె రెండో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను మొదటి నుంచి ఇదే దవాఖానలో చూపించుకున్నానని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు చేశారని, ఇప్పుడు ఒక్క రూపాయి లేకుండా శస్త్ర చికిత్స ద్వారా తనకు ప్రసవం చేశారని చెబుతోంది. అదే ప్రైవేట్ దవాఖానలో అయితే లక్షకు మీదనే ఖర్చయ్యేదని, ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారని, తనలాంటి పేదలకు ఈ దవాఖాన ఒక వరం లాంటిదని చెబుతున్నది. తనకు, తన బిడ్డకు కేసీఆర్ సార్ కిట్ అందించినందుకు ధన్యవాదాలు చెబుతోంది.
కేసీఆర్ కిట్స్‌తో చాలా మార్పులు
రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్‌తో మాతా, శిశు ఆరోగ్యం విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రసవాలంటేనే ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం ఏర్పడింది. అంతే కాకుండా ఏ ప్రైవేట్ దవాఖానలో లేని సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు మా ఎంసీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కేసీఆర్ కిట్ రాకముందు ప్రభుత్వ దవాఖానాల్లో నెలకు 200 ప్రసవాలు దాటేవి కాదు. ఇప్పుడు నెలలో 800 నుంచి 900 ప్రసవాలు చేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నారు. మిడ్ వైఫరీ ట్రైనింగ్ పొందుతున్న వాళ్లు 31 మంది, శిక్షణ ఇస్తున్న వాళ్లు మరో ఐదుగురు అందుబాటులో ఉన్నారు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 38,608 ప్రసవాలు చేస్తే ఇందులో 12,320 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఇది చాలా మంచి పరిణామం.
– డాక్టర్ ఎండీ అలీం, ఎంసీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి
ప్రసవాల సంఖ్య రెట్టింపు
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గతంతో పోల్చితే రెట్టింపు అయింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 400 నుంచి 600 ప్రసవాల ప్రభుత్వ దవాఖానలో జరుగగా ప్రస్తుతం 800 నుంచి 1200 ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్లతో పాటు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తుండడంతో ఇక్కడ ప్రసవాల సంఖ్య రెట్టింపు అయింది. గ్రామీణ స్థాయిలో ఆశా కార్యకర్తల నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు గర్భిణులను ప్రోత్సహిస్తున్నారు. నెలలు నిండిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఫాలోప్ చేయడంతో లక్ష్యాలను ఛేదిస్తున్నాం.
– డాక్టర్ జువేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి