ధర్మపురి, మార్చి 14: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, సిబ్బంది కలిసి యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఇంటికి మంగళవాయిద్యాలతో వెళ్లి ఉత్సవాలు నిర్వహించేందుకు సంప్రదాయ రీతిలో ఆహ్వానించారు. అనంతరం ఆయనను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులకు దీక్షావస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, పురోహితులు బొజ్జ సంతోష్‌కుమార్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు నేరెళ్ల్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాస్, నరసింహమూర్తి, రమణాచార్యులు కళశ, విశ్వక్సేన వాసుదేవ, పుణ్యాహవాచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీలక్ష్మీనర్సింహ స్వామి(యోగ, ఉగ్ర) శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను సేవలపై వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టిని తవ్వి ఆలయాలకు పుట్టబంగారం తీసుకువచ్చారు. పూజల అనంతరం భక్తులు పోటీపడి పుట్టబంగారాన్ని సేకరించి ఇంటికి తీసుకెళ్లారు.
ఈ పుట్టబంగారాన్ని పంటపొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. కాగా, ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు గోధూళి ముహూర్తాన స్వామి వారి కల్యాణం జరుగుతుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, రెనొవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, గందె పద్మ, అక్కనపల్లి సురేందర్, వీరవేని కొమురయ్య, చుక్క రవి, స్తంబంకాడి మహేశ్, ఇనుగంటి రమ, గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేశ్, వేముల నరేశ్, జైన రాజమౌళి, సంగం సురేశ్ పాల్గొన్నారు.