కార్పొరేషన్, మార్చి 13: కరీంనగర్లో ఈ నెల 17న మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతోపాటు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా రు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగర మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ఆర్అండ్బీ, విద్యుత్, పోలీస్, నగరపాలక సంస్థ, స్మార్ట్‌సిటీ అధికారులతో సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ, నగరాభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఈ నెల 17న మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించనున్నారని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్, 24గంటల మంచినీటి సరఫరా పైలెట్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. పర్యటనలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటగా మానేరు వంతెనపై మిషన్ భగీరథ పైలాన్ ప్రారంభంతోపాటుగా 24 గంటల మంచినీటి సరఫరా, మానేరు రివర్ ఫ్రంట్ శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
అనంతరం నగరంలోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల శిలాఫలకంతోపాటు నగరంలో నగరపాలక సంస్థ ద్వారా జరిగిన అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. దాదాపు 10 వేల మందికి సరిపడా గ్రౌండ్లో సీటింగ్ కెపాసిటీతో పాటు స్టేజ్ నిర్మించాలని సూచించారు. అంతే కాకుండా జిల్లాలోని అన్ని మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి మంత్రి సమీక్షించేలా తగు ఏర్పాట్లు చేయాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఉన్న అన్ని పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధులు చూడాలని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులు కమాన్‌చౌరస్తా నుంచి కేబుల్ బ్రిడ్జి దాకా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసి జూన్ 2లోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని, మల్టీపర్పస్ పారు పనులను కూడా జూన్‌లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
పర్యాటక కేంద్రంగా కరీం‘నగరం’
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నగరం పర్యాటక కేంద్రంగా మారుతుందని దీమా వ్యక్తం చేశారు. 24 టీఎంసీల నీరు ఉన్న రిజర్వాయర్‌లో అప్‌స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్ను అభివృద్ధి చేసుకొని ప్రజలకు పర్యాటక ప్రాంత వాతావరణం కల్పిస్తామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ నగరానికి ఒక ఆస్తిగా మిగిలిపోతుందన్నారు. ఆ దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి మన నగరాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న చౌరస్తాల అభివృద్ధి పనులను త్వరలోనే చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు. నగర మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మంత్రి ఆదేశాల మేరకు కేటీఆర్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
శిలాఫలకాల ఏర్పాటుతో పాటు సభకు స్టేజీ నిర్మాణం, సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న డివైడర్లలో మట్టిని నింపడంతోపాటు పేయింట్ వేయాలన్నారు. అంతే కాకుండా హరితహారంలో నాటిన మొకలకు కూడా పేయింట్ వేసి మంచి గ్రీనరీ కనిపించేలా సుందరీకరించాలని సూచించారు. ప్రధానంగా పారిశుధ్యపరంగా ప్రత్యేక చర్యలు తీసుకొని నగర రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావాత్, ఆర్అండ్బీ, విద్యు త్, నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారు.