వేములవాడ, మార్చి 13: భూ నిర్వాసితులకు సర్కారు అండగా నిలుస్తున్నది. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి వెంటనే పరిహారం ఇస్తున్నది. ఆదివారం 17మందికి 7కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రమేశ్‌బాబు అందించగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమైంది.
మీ త్యాగం మరువలేనిది: రమేశ్‌బాబు
రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న భూ నిర్వాసితుల కుటుంబాలకు ప్రతి భక్తుడి ఆశీర్వాదం ఉంటుందని ఎమ్మెల్యే రమేశ్‌బాబు పేర్కొన్నారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ భూ నిర్వాసితులు 17మందికి రూ.7కోట్ల చెక్కులను ఆదివారం రాజన్న ఆలయ సమావేశ మందిరంలో అందజేసి మాట్లాడారు. పోచమ్మ ఆలయం ప్రస్తుతం రెండు గుంటల్లో ఉన్నందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో దానిని ఎకరం స్థలానికి విస్తరించి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. భూ సేకరణ పూర్తయ్యాక మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేక సమావేశం పెట్టుకుందామని వారికి చెప్పారు.
పోచమ్మ ఆలయ విస్తరణలో దుకాణం ఉన్నవారికి నామమాత్రపు అద్దెతో దుకాణం, ఒప్పంద ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ విస్తరణలో భాగస్వామ్యులు అవుతున్న వారి త్యాగం ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఆలయ విస్తరణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి తాను అన్నివిధాలా అండగా ఉంటానని పేర్కొంటూనే పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజన్న శేషవస్త్రంతో స్వామివారి ప్రసాదం, చెక్కును అందజేశారు. ఇక్కడ మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వీటీడీఏ ఎస్టేట్ అధికారి గంప సత్యనారాయణ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు సిరిగి శ్రీరాములు, పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.