ఇబ్రహీంపట్నం, మార్చి 13: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ‘మన ఊరు – మన బడి’ లో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం, వర్షకొండ, గోదూర్, కోమటికొండాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. స్కూళ్ల పరిసరాలను పరిశీలించారు.
అనంతరం మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తయారు చేస్తున్నామని, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కార్యక్రమ కింద త్వరలోనే బడులన్నింటికీ కొత్త రూపు వస్తుందని వివరించారు. విద్యార్థులకు తాగునీటి వసతి, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, ప్రహరీలు, ఫర్నీచర్, టాయిలెట్స్, విద్యుత్, తదితర సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏ అవసరాలున్నాయో ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులతో చర్చించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. అనంతరం ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఎమ్మెల్యేను పూలమాల, శాలువాతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు నేమూరి లత, దొంతుల శ్యామల, కొప్పెల శ్రీనివాస్, సోమ ప్రభాకఱ్, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, ఎంపీటీసీలు పొన్కంటి వెంకట్, చిన్నారెడ్డి, రాములు పాల్గొన్నారు.