ముకరంపుర, మార్చి 13: శాతవాహన విశ్వవిద్యాలయంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న గుడ్డెలుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు గుడ్డెలుగు సంచారానికి సంబంధించి లభ్యమైన ఆధారాలతో బంధించేందుకు ప్రయత్నాలు చేసినా అంతగా ఫలితమివ్వలేదు. దాహార్తిని తీర్చుకోవడానికి నీటి కుంట వద్దకు రాత్రి వేళ ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వస్తుందని భావించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో కెమెరాలను అమర్చారు. బోను ఏర్పాటు చేసి అందులో గుడ్డేలుగు ఇష్టంగా తినే పదార్థాలను ఉంచారు.
నాలుగు రోజులు గడిచినా పట్టుబడలేదు. దీంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. విశాలమైన వర్సిటీ ప్రాంగణంలో గుడ్డేలుగు తన స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుందనే జాడ ఇప్పటికీ అంతుచిక్కలేదు. నాలుగు రోజులుగా అటవీశాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో శాతవాహనకే పరిమితమైంది. అయినప్పటికీ తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎక్కడ తప్పిదం జరుగుతుందనే అంశంపై విశ్లేషించారు. జన సంచారం లేకుండా, అలికిడి లేని సమయంలో మాత్రమే వన్య మృగాలు అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే వర్సిటీ ప్రాంగణంలోని గుట్టలు, అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న దారుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు, సిబ్బంది, వివిధ పనులపై వచ్చే వారంతా రాకపోకలు సాగిస్తున్నారు. వసతి గృహాలతో పాటు వర్సిటీ ప్రాంగణంలో విద్యుద్దీపాల వెలుగులతో గుడ్డేలుగు రాత్రి సమయంలో బయటకు రావడానికి అనువైన వాతావరణం లేకపోవడం ఓ కారణంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుడ్డేలుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు తమదైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. వన్య మృగాలు సంచరించే ప్రాంతాలను పాదముద్రలతో పాటు వాటి విసర్జితాల ఆధారంగా గుర్తించేలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించి 200ఎకరాల్లోని గుట్టలతో పాటు దట్టమైన పొదలు, చిట్టడవిని అడుగడుగునా జల్లెడ పట్టడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు క్యాంపస్‌కు సెలవులు కూడా ప్రకటించారు.
శాతవాహనలో రెండు రోజులు తరగతుల రద్దు
కమాన్‌చౌరస్తా, మార్చి 13: శాతావాహన విశ్వవిద్యాలయంలో మూడురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్న క్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారుల సూచన మేరకు విద్యార్థులకు రెండు రోజులు తరగతులు రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 14, 15 తేదీల్లో ఈ ఉత్తర్వులు అమలులో ఉం టాయని చెప్పారు. విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కళాశాల, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులకు తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు రిజిస్ట్రార్ వివరించారు. వస తి గృహంలో ఉండే విద్యార్థులు లోపలే ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి తరగతుల నిర్వహణ తేదీలను ప్రకటించే వరకు బోధన, బోధనేతర సిబ్బంది యథావిధిగా విధులకు హాజరుకావాలని చెప్పారు.