హుజూరాబాద్/ మానకొండూర్, మార్చి 8 : దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే మహిళలకు అత్యంత రక్షణ ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూపా గార్డెన్లో, అంతకు ముందు మనకొండూర్లోని సుప్రీం ఫంక్షనహాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడుతూ పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యసభలో బిల్లు ఆమోదించినప్పటికీ లోకసభలో బిల్లు పెట్టకుండా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇప్పటికైనా మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ ఛేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలకు అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. ఆడపిల్లలను గౌరవించే సాంప్రదాయాలను, మంచిచెడును పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని తమ కాళ్లమీద తాము నిలబడి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు.
మహిళల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్యే రసమయి
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. గతంలో ఆడపిల్ల పుడితే ఆయ్యో అని బాధ పడే రోజులు ఉండేవని, ఇప్పుడు అదృష్ట దేవత పుట్టినట్లుగా తల్లిదండ్రులు భావిస్తున్నారని, అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముదుసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి : గెల్లు శ్రీనివాస్‌యాదవ్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారని, వృద్ధ, ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మహిళలపై దాడులు తగ్గాయి : బండ శ్రీనివాస్
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో వారిపై దాడులు తగ్గాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆడబిడ్డల వివాహాలకు దేశంలోనే ఎకడా లేని విధంగా కల్యాణలక్ష్మి, ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందన్నారు. మానకొండూర్‌లో కార్యక్రమ ప్రారంభానికి ముందు చెరువకట్ట నుంచి మహిళలు బోనాలతో ర్యాలీగా తూర్పు దర్వాజ మీదుగా ఫంక్షన్‌హాల్ వరకు తరలివచ్చారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల పాటలు, చిన్నారుల నృత్యాలు అలరించాయి.
ఈ సందర్భంగా రెండుచోట్ల మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్, టీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, ఎంపీపీ ఇరుమల్ల రాణి, వ్యవసాయ మారెట్ చైర్మన్ రమ, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మండలాలల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, టీఅర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.