కరీంనగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : తరతరాలుగా వెనుకబడిన దళితుల గురించి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గొప్ప పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజూ అందజేసే యూనిట్ల లబ్ధిదారులందరూ మహిళలే కావడం విశేషమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడకముందే సీఎం కేసీఆర్ ఏర్పర్చుకున్న సంకల్పాన్ని వదలకుండా ఒక్కో సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపుతున్నారని, ఇప్పటికే సాగునీరు, విద్యుత్ రంగం లో అద్భుతాలు సాధించారని కొనియాడారు.
అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని, రైతుబంధుతో రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పిల్లలకు ఉన్నతమైన విద్య అందించడం కోసం, ఈ వర్గాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రూ.వేలాది కోట్లు వెచ్చించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు.
ఈసారి బడ్జెట్లో కూడా రూ. 17,800 కోట్లు కేటాయించామని, స్వల్ప కాలంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు. టీఆర్ఎస్పై ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్రంలోని అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను, అన్ని కులాలను వృద్ధిలోకి తేవడమే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. చేసేందుకు పని లేక, వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి లేక దళితులు డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేసుకుని బతుకుతున్నారని, అలాంటి వారిని ఇప్పుడు వాహనాలకు ఓనర్లను చేస్తున్న మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ హుజూరాబాద్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీ సురేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్..
దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాన మంత్రి ఇంత వరకు ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదు. 70 ఏండ్లలో కనీసం ఆలోచన చేయలేదు. దళిత బంధు ఇస్తరా?, అది సాధ్యమయ్యేదేనా? అని, ఈ పథకం ఎన్నికల కోసమే తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. సీఎం కేసీఆర్ ఒకసారి చెబితే అది సాధ్యమయ్యే వరకు వెనకడుగు వేయరు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తానని చెప్పి సాధించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్ప ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో వచ్చిన సంపదంతా బడుగు బలహీన వర్గాలకు చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మొదట దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లోనే రూ. 17, 800 కోట్లు పెట్టిన మహానుభావుడు ఆయన.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వర్తించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అమలు జరుగుతోంది. లబ్ధిదారులు ఏది కోరుకుంటే అది అందిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా దళిత బంధు మహిళా లబ్ధిదారులకు పెద్ద ఎత్తున యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. గతంలో మినీ బస్సు నడిపిన వ్యక్తి ఇపుడు అదే మినీ బస్సుకు ఓనరయ్యాడు. వాహనాలపై డ్రైవర్లుగా, క్లీనర్లగా ఉన్న వ్యక్తులను వాహనాలకు ఓనర్లుగా చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ పథకంతో తమ కుటుంబాలను పోషించుకోగలుగుతామని, తమ బతుకులు మార్చుకోగలుతామనే ఆత్మ విశ్వాసం ఇప్పుడు ప్రతి దళిత కుటుంబంలో కనిపిస్తున్నది.
రాష్ట్రం ఏర్పడక ముందే దళిత బంధు..
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు యావత్ తెలంగాణ ప్రజల జీవితాలను విశ్లేషించాం. ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు చాలా అన్యాయానికి గురయ్యారని అవగాహనకు వచ్చాం. ఈ నేపథ్యంలో 2002లోనే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ దళిత పాలసీని ప్రకటించింది. దళిత మేధావులు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖకు కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కృష్ణన్‌ను కేసీఆర్ స్వయంగా చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా దళిత పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ రోజు మాకు అధికారం లేదు. కానీ తెలంగాణ వస్తుందని, రాష్ట్రంలో దళిత జాతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ నాడే ఈ ఆలోచన చేశాం. ఇప్పుడు దళిత బంధు రూపంలో అమలు చేస్తున్నాం.
హుజూరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఇది ఎన్నికల కోసం చేసే కార్యక్రమమని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేవు మరి ఎందుకు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రోజే దాదాపు రూ. 38 కోట్ల విలువైన ఈ మిషనరీని దళితుల కోసం పంపిణీ చేశాం. నిన్నటి వరకు ఒక బస్సు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి ఈ రోజు బస్సుకు యజమానిగా మారిపోయాడు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే కేసీఆర్ మదిలోకి వచ్చిన ఆలోచన ఇది. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కొందరు దుర్మార్గమైన మాటలతో మా పార్టీని, మమ్మల్ని దూషిస్తున్నారు. మేము ఎవరికీ భయపడేది లేదు. ఎవరికీ తల వంచేది లేదు. బాధ పడేది కూడా లేదు. ఎవరికీ వెరవకుండా మా ఆలోచనలను కార్యరూపంలో పెడుతూనే ఉన్నాం..