హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నాయకులు కేవలం పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నరని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్‌పై తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, ఆ బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో ఈ దుర్మార్గం అంతా జరుగుతున్నదని తెలిపారు.
హంగు ఆర్భాటంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బయటకు వచ్చిన తర్వాత మొహం చూపించకుండా వెళ్ళిపోయాడని అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అర్హత లేని పిటిషన్ వేసినప్పుడే వీళ్లకు తెలంగాణ ప్రయోజనాలపట్ల సోయి లేదనే విషయం తేలిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు వాటాల పంచాయతీ, ఢిల్లీకి మూటలు పంపించడమే సరిపోతుందని అన్నారు.
రాష్ట్ర సర్కారులోని ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకే తెలియడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల చేతిలో ఉన్నదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్లాట్ల దందా తప్ప మరొకటి తెలియదని విమర్శించారు.