హుజూరాబాద్ రూరల్, మార్చి8 : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామ శివారులోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం గ్రామానికి చెందిన ఎనిమిది మంది కారులో వేములవాడ, కొండగట్టు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా సింగాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బొజ్జ సువర్ణ(48), వినోద్(30) అక్కడికక్కడే మృతి చెందగా, బొజ్జ సురేశ్, బొజ్జ శ్రీనివాస్, బొజ్జ దర్మతేజల తీవ్రంగా గాయపడ్డారు. అమృత్ సింగ్, తేజ, టింకుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు, పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం కోసం దవాఖానకు తరలించారు.