6 కోట్లతో సుందరీకరణ
గోదావరి జలాలతో కళకళ
మంత్రి కేటీఆర్ కృషితో మహర్దశ

కాకతీయుల కాలం నాటి ముస్తాబాద్ పెద్ద చెరువు కొత్త శోభను సంతరించుకున్నది. ఒకప్పుడు కట్ట తెగి రూపురేఖలు కోల్పోయిన ఈ జల వనరు నేడు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. నిండా గోదావరి జలాలతో సమీప గ్రామాల్లో నీటి ఎద్దడి తొలగిపోగా, రైతులు, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పెద్ద చెరువు నాటి సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. కట్టకు అనేక సార్లు గండిపడినా పట్టించుకోలేదు. కానీ, స్థానికులే ఇసుక బస్తాలు వేసి అనేక సార్లు మరమ్మతులు చేసుకున్నారు. నాలుగేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు మరోసారి కట్ట తెగడంతో చెరువు రూపురేఖలు కోల్పోయింది. చుక్క నీరూ లేక పోవడంతో మరమ్మతులు చేయించాలని మంత్రి కేటీఆర్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు విన్నవించారు.
మంత్రి చొరవతో..
మంత్రి కేటీఆర్ చొరవ చూపడంతో చెరువుకు మహర్దశ వచ్చింది. కట్టను పటిష్టం చేయించడంతో గత వానకాలంలో కురిసిన వర్షాలకు నిండుకుండలా మారి అలుగు దుంకింది. అలాగే చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి సుందరీకరించాలని 6 కోట్లు మంజూరు చేశారు. దీంతో చెరువు కట్ట విస్తరణ, బతుకమ్మ వేదిక, రేలింగ్, గార్డెనింగ్, కట్టపై లైట్లు, ఓపెన్ జిమ్, నడక దారుల పనులు పూర్తయ్యాయి. కట్ట కింద చేపట్టిన పల్లె ప్రకృతి వనం, పార్కు పనులు పూర్తయితే ఈ ప్రాంతం సందర్శకులను మరింత ఆకట్టుకోనున్నది. ఇటివలే ప్రభుత్వం మల్లన్న సాగర్ కాల్వ ద్వారా చెరువులోకి గోదావరి జలాలు విడుదల చేసి ఆయకట్టు రైతుల్లో భరోసా నింపింది. చుట్టు పక్కల గ్రామాల్లోనూ భూగర్భ జలాలు పెరిగి నీటికి ఢోకా లేకుండా పోయింది.
రైతుల కల నెరవేరింది
ప్రత్యక్షంగా రెండు, పరోక్షంగా నాలుగు గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే పెద్ద చెరువు మంత్రి కేటీఆర్ చొరవతో మినీ ట్యాంక్ బండ్‌గా మారింది. 6 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. గోదావరి జలాలతో నింపారు. దాంతో నీటి సమస్య తీరింది. పర్యాటకంగానూ శోభ సంతరించుకున్నది. మంత్రి కేటీఆర్‌కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు.
ఎవరూ ఊహించలేదు..
పెద్ద చెరువు మోడల్ చెరువుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కొట్టుకు పోయిన కట్టకు మరమ్మతులు చేయించడమే కాక చెరువును పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. మంత్రి కేటీఆర్ చొరవతో మినీ ట్యాంక్ బండ్‌గా మారింది. గోదావరి జలాలను నింపడంతో నిండుకుండ లెక్క కనిపిస్తున్నది.