కొత్తపల్లి, డిసెంబర్ 2 : శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల పురుషులు, మహిళా విద్యార్థులకు గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వర్సిటీ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారుల నుంచి స్పందన లభించింది. ఈ పోటీలకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వర్సిటీ హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపిక చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్, ఎస్ఆర్ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేశ్వర్రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపిక పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు ప్రతిభను చాటి ఆల్ ఇండియా వర్సిటీ పోటీలకు ఎంపికై సత్తాచాటాలని సూచించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెకర్లు శ్రీధర్‌రావు, హరిరామ్, రవి, సర్వర్, హ్యాండ్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి నమిలికొండ ప్రభాకర్, పీఈటీలు జిట్టబోయిన శ్రీనివాస్, అశోక్, సతీశ్, కోచ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలోని పురుషులకు శుక్రవారం మల్కాపూర్ రోడ్డులోని శాతవాహన యూనివర్సిటీలో వాలీబాల్ ఎంపిక ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరికాంత్ తెలిపారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు శాతవాహన యూనివర్సిటీలో అన్ని అర్హత పత్రాలతో రిపోర్ట్ చేయాలని సూచించారు.