మానకొండూర్, డిసెంబర్ 2: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తతోనే వ్యాధి నివారణ సాధ్యమని పశువైద్యాధికారులు అరవింద్‌రెడ్డి, సుస్మితారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఖాదర్‌గూడెం, పెద్దూర్పల్లిలో గురువారం పశువైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 610 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశుపోషకులు, రైతులు గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది బలరాం, విజయలక్ష్మి, సమతారాణి, సాదిక్, వెంకటయ్య, రాజయ్య, మరియా, రైతులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వైద్య శిబిరాలు
చిగురుమామిడి, డిసెంబర్ 2: మండలంలోని పలు గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణకు గాను పశువులకు టీకాలు వేస్తున్నట్లు మండల పశు వైద్యాధికారులు శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని రేకొండ, గాగిరెడ్డిపల్లి, బొల్లోనిపల్లెలో పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి ఏటా పశువులకు రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకకుండా గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించి టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షుడు నీల వెంకన్న, పశువైద్య సిబ్బంది అబిద్ హుస్సేన్, సత్యం, సందీప్, నాగుల రాజేశం, గోపాలమిత్రలు వెంకటేశ్వర్లు, కుమార్, వెంకన్న, పశుమిత్ర ప్రభ పాల్గొన్నారు.
కరీంపేట్లో..
శంకరపట్నం, డిసెంబర్ 2: మండలంలోని కరీంపేట్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులు, మేకలు, గొర్రెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మొత్తం 254 జీవాలకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి భాగ్యలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.