కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు కేవలం 3,014 ఓట్లు మాత్రమే రావడంపై ఆ పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్లో రెండు పర్యాయాలు మంత్రి పదవిని అనుభవించిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేశారు. కొత్తగా బరిలోకి దిగిన గెల్లు.. ఈటలకు గట్టిపోటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం విడుదలైన ఉప ఎన్నిక ఫలితాల్లో 1,07,022 ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాగా, 83,167 టీఆర్ఎస్, 3,014 ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. 23,855 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థికి అధికార టీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. కొత్త అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ ఈటలకు అసలు పోటీయే కాదని కొంత మంది పేర్కొన్నారు. కానీ, గట్టి పోటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం చెబుతున్నారు. నియోజకవర్గంలో ఉద్ధండుడిగా ఉన్న ఈటలకు గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో చెమటలు పట్టించారు. ఎన్నిక ఫలితాలు కూడా ఇదే విధంగా వచ్చాయి. ఏ రౌండులోనూ ఈటలకు భారీ మెజార్టీ రాకపోవడం ఇందుకు నిదర్శనం. 2018 ఎన్నికల్లో మంచి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి మాత్రం అడ్రస్ కోల్పోయింది. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన టీఆర్ఎస్ నాయకులు ప్రచార సమయంలోనే ఈ విషయాన్ని ఎత్తిచూపారు. స్థానికేతరుడైన బల్మూరి వెంకట్‌కు టికెట్ ఇవ్వడం, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, మొక్కుబడిగా ప్రచారం చేయడం వంటివాటితో కాంగ్రెస్.. బీజేపీతో కుమ్మక్కయినట్లు స్పష్టమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
పురపాలకశాఖ రీజినల్ డైరెక్టర్ ఉత్తర్వుల జారీ
వేములవాడ, నవంబర్ 2: వేములవాడ పురపాలక సంఘంలో చిల్లర పద్దుల నగదు దుర్వినియోగంలో విచారణ జరిపిన పురపాలక సంఘం వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ జూనియర్ అసిస్టెంట్ క్రాంతిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును కార్యాలయానికి జమ చేయకుండా ముగ్గురు ఉద్యోగులు సొంతానికి వాడుకున్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. ఇందులో శ్రీనివాస్ అనే ఉద్యోగిపై రెండు నెలల క్రితమే సస్పెన్షన్ వేటు పడగా, ప్రస్తుతం క్రాంతిని మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఉద్యోగి కూడా విధులు నిర్వహించిన సమయంలో రికార్డులను అందజేయలేదు. విచారణ సమయంలో అధికారులు గడువు ఇచ్చినా అందజేయకపోవడంతో సదరు ఉద్యోగిపైనా వేటు పడే అవకాశం ఉంది.