కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 2 : హరితహారం కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలతో కిష్టంపేట గ్రామం హరితవనంగా మారింది. హరితతెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు కిష్టంపేట పంచాయతీ పాలకవర్గం సభ్యులు. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కిష్టంపేటలో ఐదెకరాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఇందులో నాటించిన 11 వేల మొక్కల్లో ఒక్క మొక్క కూడా ఎండి పోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతున్నారు. గ్రామ శివారులోని ఐదెకరాల ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉండడం గమనించిన సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి పాలకవర్గం సహకారంతో ఆ భూమిని చదును చేయించారు. ఐదో విడత హరితహారంలో మామిడి, ఉసిరి, జామ, నేరేడు, దానిమ్మ , టేకు, వేప, కానుగ, నీలగిరి తదితర 11వేల మొక్కలు నాటించారు. పంచాయతీ పాలకవర్గం, ఈజీఎస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. మొక్కల సంరక్షణకు కాపలాదారుడిని నియమించారు. వేసవిలో మొక్కలకు నీళ్లు పోయించడంతో పండ్ల మొక్కలు పెరిగి కాత దశకు చేరుకున్నాయి. కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అప్పటి కలెక్టర్ సిక్తాపట్నాయక్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎందుకూపనికి రాకుండా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం పచ్చదనాన్ని సంతరించుకుంది. కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో నాటిన మామిడి, ఉసిరి కాత దశలో ఉన్నట్లు సర్పంచ్ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.
హరితవనంగా కిష్టంపేట
కిష్టంపేటలో కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలతో ఈ ప్రాతం హరితవనంగా మారింది. ప్రభుత్వ భూమిలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడానికి గ్రామస్తుల సహకారం ఉంది. కమ్యూనిటీ ప్లాంటేషన్‌కు ప్రహరీ లేకున్నా గ్రామస్తుల సహకారంతో కాపాడుకున్నాం. పండ్ల మొక్కలు కాత దశకు వచ్చాయి. మొక్కల పెంపకంలో గ్రామ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పండ్ల మొక్కలు వచ్చే సంవత్సరం మంచి దిగుబడినిస్తాయి.