హనుమకొండ, అక్టోబర్ 29 : రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. టీఆర్ఎల్డీ ఆధ్వరయలో చేపట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బుధవారం వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణలో అధికారంలోకి రావడానికి, ఓట్లు దండుకునేందుకే 420 హామీలిచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీల రిజర్వేషన్ పేరుతో వస్తున్నాడని, ఇటీవల కాలంలో బీసీల చైతన్యం పెల్లుబికి వచ్చిందని అగ్రవర్ణాల దోపిడీ పాలనను అంతం మొందించాలంటే ప్రజలు ఎస్సీ ఎస్టీలతో జతకట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
420 ఎలక్షన్ హామీలను ఇచ్చి అధికారాన్ని చేజికించుకున్న కాంగ్రెస్ చేసిందేమిటో శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచాలన్నారు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల సీఎం వ్యవహార శైలిని ఆమె కుమార్తెనే స్వయంగా ఎండగట్టారని, ఈ పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు ముఖ్యంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల ఆత్మబలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజిక తెలంగాణగా మార్చవలసిన చారిత్రిక అవసరం ఉందన్నారు.
ఇతర పార్టీలలో సీట్లు సాధించలేకపోతే ఆర్ఎల్డీ వారికి 80 శాతం సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉందని, రాజకీయాల పట్ల ఏవగింపు ఉన్న సమర్థులైన యువత రాజకీయాలలోకి రావాలి, సామాజిక తెలంగాణను ఏలుకోవాలన్నారు. యువత సాధికారత కోసమే జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని టీఆర్ఎల్డీ పార్టీకి చెందిన ‘లక్ష్యం’ యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఈ జాబ్ మేళాల వివరాలన్నీ యువత తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులతో పాటు టీఆర్ఎల్డీ నాయకులు, స్పోక్స్‌పర్సన్ బీరప్ప, మల్లేష్, రిషబ్ జైన్, నరసింహరావు, సుధాకర్ పాల్గొన్నారు.