ఖాఠ్మాండు: పర్వతారోహకులు ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన నేపాలీ కంచ షెర్పా(Kancha Sherpa) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని హిల్లరీ-టెంజింగ్ గ్రూపు అధిరోహించిన విషయం తెలిసిందే. సుమారు 8849 మీటర్ల ఎత్తు ఉన్న ఆ శిఖరాన్ని 1953, మే 29వ తేదీన అధిరోహించారు. అయితే హిల్లరీతో పాటు ఎవరెస్టును ఎక్కిన షెర్పాలో కంచ కూడా ఉన్నారు. ఆ బృందంలో బ్రతికి ఉన్న చివరి వ్యక్తి ఈయనే.
ఖాఠ్మాండు జిల్లాలోని కపన్ హోంటౌన్లో ఆయన తుది శ్వాస విడిచినట్లు నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుర్ గెల్జీ షెర్పా తెలిపారు. హిల్లరీ బృందంలో మొత్తం 35 మంది పర్వతారోహకులు ఉన్నారు. అయితే ఆ బృందాన్ని నేపాలీ పర్వతారోహకుడు కంచె షెర్పా గైడ్‌గా వ్యవహరించారు. ఫైనల్ క్యాంపునకు చేరుకున్న ముగ్గురు షెర్పాల్లో ఈయన ఒకరు.
నాంచా బజార్లో 1933లో ఆయన జన్మించారు. 19 ఏళ్ల నుంచి పర్వతారోహణ చేశారు. 50 ఏళ్ల వరకు ఆ వృత్తిలో కొనసాగారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.