విద్యానగర్, మార్చి 14 : జిల్లా కేంద్ర శివారులోని ధరణి టౌన్షిప్లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో సోమవారం కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టౌన్షిప్లోని 62 ప్లాట్లకు సోమవారం వేలం వేసినట్లు తెలిపారు. చదరపు గజానికి రూ. ఏడు వేల నుంచి 14,200 వరకు ధర పలికిందని చెప్పారు. బహిరంగ వేలానికి విశేష స్పందన లభించిందన్నారు. మొత్తం 195 మంది వేలంలో పాల్గొన్నారని చెప్పారు.
44వ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్ ఉండడంతో సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు వేలం పాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహ పథకంలో గతంలో రూ.మూడు వేలు చెల్లించిన లబ్ధిదారులు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు వేలం దశల వారీగా కొనసాగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో జల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శ్రీను, అధికారులు పాల్గొన్నారు