నిజామాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేసవికాలం మొదలవ్వడంతోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి రెండో వారానికే నిప్పులు చిమ్ముతున్న భానుడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కనిష్ఠ స్థాయిలోనే నమోదవుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మార్చి నెల ప్రారంభం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలకు చేరువవుతున్నది. పెరిగిన ఎండ తీవ్రతతో ప్రజలంతా ఉపశమన చర్యలపై దృష్టి సారించారు. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యధికంగా ఇండ్లకే పరిమితమవుతున్నారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయం లేకపోవడంతో ఇండ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో సేదతీరుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున తప్పనిసరిగా ఇండ్ల నుంచి బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా 2021-22 విద్యా సంవత్సరానికి ఒంటిపూట బడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. మంగళవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ ఒంటి పూటనే నిర్వహించనున్నాయి.
ఉష్ణోగ్రతలిలా…
ఈసారి శీతాకాలంలోనూ ఎండ తీవ్రత కనిపించిం ది. చలికాలం పూర్తికాకముందే ఎండలు ప్రతాపం చూపాయి. ఫిబ్రవరి 1న కనిష్ఠం 14.2 డిగ్రీలు, గరిష్ఠం 30.4 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. ఇక మార్చి నెల వచ్చే సరికి ఒకటో తారీఖు నాడు కనిష్ఠ 23 డిగ్రీలు, గరిష్ఠం 33.7 డిగ్రీలుగా ఉంది. గడిచిన పది రోజులుగా వేసవి తీవ్రత పెరుగుతూ వస్తున్నది. ఉష్ణోగ్రతలు ఎగబాకుతుండడం తో ప్రజలు సైతం స్వీయ జాగ్రత్తలపై దృష్టి సారించారు. మరోవైపు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని విద్యా సంస్థల్లో ఒంటి పూట బడుల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం..
వేసవికాలం ముంచుకొస్తుండడంతో నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ వాడకం క్రమంగా పెరుగుతున్నది. ఎండవేడిమి పెరుగుతున్నా కొద్దీ గృహ అవసరాలకు కరెంట్ వినియోగం అమాంతం అధికమవుతున్నది. ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు ఇలా రకరకాలుగా వేడిమి నుంచి ఉపశమనానికి ప్రజలంతా సిద్ధం కావడంతో విద్యుత్ డిమాండ్ అమాంతం ఎగబాకుతున్నది. వానకాలంలో కురిసిన వర్షాలకు బోరు బావుల్లో సమృద్ధిగా భూగర్భ జలాలున్నాయి. దీంతో రైతన్నలంతా యాసంగిలో జోరుగా వివిధ రకాల పంటల సాగు చేశారు.
సాగుకు నీళ్లు అవసరం కావడంతో అన్నదాతలు మోటర్లకు పెద్ద ఎత్తున పని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ సరఫరా చేస్తుండడంతో కర్షకులు ఆనందంగా పంటలు పండిస్తున్నారు. దీనికి తోడుగా వేసవి కాలం రాకతో ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతుండడంతో ప్రజలంతా ఉపశమన చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఒక్కసారిగా వ్యవసాయ, గృహ, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి కరెంట్ వినియోగం తారాస్థాయికి చేరడంతో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అవుతున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.