నిజామాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లే కుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు దరి చేరుతున్నాయి. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న నానుడి నుంచి నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యారోగ్య శాఖలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వైద్యాధికారుల వరకు ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు అంతా ఇంతా కాదు. వారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూనే ఉంది. అయితే… ఇందులో ప్రజలకు కీలకమైన సేవలు అందించే ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో మేలు చేస్తున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా పెంచుతూ ప్రత్యేకతను చాటుకున్నది. తాజాగా ఆశ వర్కర్ల సేవల్లో సాంకేతికతను జోడించింది. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లు, 4జీ సిమ్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఆఫ్‌లైన్ నివేదికలకు బదులుగా ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు సైతం చేసింది.
ఆశ డిసీస్ ప్రొఫైల్ యాప్…
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆశ వర్కర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్నది. స్మార్ట్ ఫోన్లలో నేరుగా గర్భిణులు, రోగుల సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఏర్పడుతున్నది. అలాగే అతి త్వరలోనే ఏఎన్ఎం-1, ఏఎన్ఎం- 2లకు ఐప్యాడ్లు అందజేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు 1500 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ ఫోన్లు అందించారు. ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య సర్వే, టీబీ, లెప్రసీ సర్వేలతో పాటు పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్లు ఇప్పించడం, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య వివరాల నమోదు, బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఆయా నివేదికలను జిల్లా వైద్యారోగ్య శాఖకు అందిస్తుంటారు. ఈ నివేదికలను ఆన్లైన్లోనే పంపాల్సి ఉండగా చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలను వదిలి తమ సమీప పీహెచ్‌సీలకు రావాల్సి వస్తున్నది. అలాంటి సమస్యలు లేకుండా ఈ ఫోన్లలో ఆశ డిసీస్ ప్రొఫైల్ యాప్‌ను వినియోగిస్తున్నారు. తెలుగులోనే తయారు చేసిన ఆ యాప్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల నుంచి సేకరించిన అవసరమైన సమాచారాన్ని నివేదికగా ఉన్నతాధికారులకు పంపే అవకాశాలున్నాయి.
సులభతరంగా సేవలు…
ఇంటింటి సర్వేలతో కుటుంబంలోని ఒక్కొక్కరి హెల్త్ ప్రొఫైల్ ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీని ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలను పర్యవేక్షించడం సులభతరం కానున్నది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేపట్టగా కొద్ది రోజుల్లోనే అందరికీ చేరుతాయి. రోజువారీగా చేసిన పనిని ఆఫ్‌లైన్ ద్వారా నివేదికలను ఆశ కార్యకర్తలు పంపించే వారు. ఈ నివేదికల తయారీలో కొంత మేర తిప్పలు ఎదురయ్యేవి. కొత్తగా ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు ఇస్తుండడంతో ఉపయుక్తం కానున్నది. ఫోన్లతో గర్భిణులు, చిన్నారులు, టీకాలు, బీపీ, షుగర్, టీబీ వ్యాధిగ్రస్తులకు అందించే సేవలను వెంటనే ఆన్లైన్ చేసి పంపడానికి అవకాశం ఉంటుంది. పనులు సులభతరం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందించడంలో ఆశ కార్యకర్తలు కీలకంగా మారారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధుల్లా ఆశలు వ్యవహరిస్తుంటారు. ఇకపై ఇంటింటి జ్వర సర్వేతో పాటు అన్ని రకాలుగా అందిస్తున్న సేవలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు చేరనున్నది.
భారీగా జీతాల పెంపు…
ఆశవర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే అందేది. జీతాల పెంపునకు రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. వీరి మొరను కనీసం ఆలకించలేదు. స్వరాష్ట్రంలో తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్ ఆశవర్కర్లకు వేతనాలను భారీగా పెంచారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ వేతనాన్ని రూ.3వేలకు అక్కడి నుంచి రూ.7,500లకు పెంచారు. రోడెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే, దరఖాస్తులిచ్చి దండం పెట్టే బాధలు లేకుండానే మరోమారు వేతనాలను భారీగా పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా పీఆర్సీని అమలు చేయడం ద్వారా వారి వేతనం ఇప్పుడు రూ.9,750లకు చేరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆశవర్కర్లకు అందుతున్న జీతం రూ.4వేలు మాత్రమే. గతంలో ఆశవర్కర్లకు జీతాలు సరిగా వచ్చేవి కావు. రెండు, మూడు నెలలకోసారి మాత్రమే ప్రభుత్వం అందించేది. తెలంగాణలో ఠంచనుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నెలవారీగా బ్యాంకుల్లో జమ అవుతుండడం విశేషం.
అద్భుత సేవలు…
కరోనా రూపంలో సమాజానికి ఎదురైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఆశ వర్కర్లు అందించిన సేవలు అమోఘం. వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో తీవ్ర భయాందోళనలు సర్వత్రా వ్యక్తం అయ్యా యి. ఎక్కడో ఒక చోట వైరస్ వెలుగు చూస్తే ఊరంతా బంద్ పాటించే పరిస్థితులు రెండేండ్ల క్రితం కనిపించాయి. అలాంటి భయానక స్థితిలో ఆశవర్కర్లు పని చేసిన తీరు ఆదర్శం. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించేందుకు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించారు. ఇక రెండో వేవ్, మూడో వేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేలోనూ ఆశ వర్కర్లే కీలకంగా వ్యవహరించారు. ఏఎన్ఎంలకు తోడుగా ఆశలు సైతం ప్రాధాన్యతా స్థాయిలో పని చేశారు. కొవిడ్ -19 సోకిన వారికి నిరంతరం పర్యవేక్షించడం, వారికి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడం, ఔషధాలు అందించడం, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే అప్రమత్తం చేయడంలో ఆశలు కీలకంగా వ్యవహరించారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆశలు ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే వైద్యారోగ్య శాఖకు నివేదికలను పంపుతున్నారు. తద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడం, నివేదికల సమర్పణకు ఖర్చు మీద పడడం వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వమే ప్రత్యేక చొరవతో స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సులభతరం కానున్నది.