బాన్సువాడ, అక్టోబర్ 30: స్వరాష్ట్రంలో ఆలయాలకు కేసీఆర్ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువచ్చింది. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, పుష్కలంగా నిధులు మంజూరు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో పురాతన ఆలయాలు మొదలుకొని కొత్త ఆలయాల వరకు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఆదరణకు నోచుకో లేదు. నిర్వహణ భారంగా మారడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. రాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ నిధులు పుష్కలంగా విడుదలచేయడంతో పలు ఆలయాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆధ్యాత్మికతకు చిరునామాగా విరాజిల్లుతున్నది. ఒకవైపు ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చని పంట పొలాలు, మరోవైపు సరస్సు ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు ఆనందానుభూతిని పంచుతున్నది.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కేటాయించిన రూ.23 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సహకారం, స్పీకర్ పోచారం ప్రత్యేక కృషితో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఆలయం కింది భాగంలో ఉన్న సరస్సులో బోటింగ్ ఏర్పాటు, ఆలయంపై భాగంలో స్వామి వారి కల్యాణ మండ పం, రెండు రాజగోపురాలు, రెండు గాలి గోపురాలు, యజ్ఞశాల, ప్రాకారాలు, అష్టముఖి శాలహారాలు నిర్మిస్తున్నారు.
భక్తుల కోసం సౌకర్యాలు
తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కోసం ప్రభుత్వం అందించిన నిధులతో పలు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 54 గదులతో అతిథి గృహాలు, భక్తులు మొక్కులు తీర్చుకునే కల్యాణ కట్ట, శుభకార్యాలకు ఫంక్షన్ హాల్, స్వామి వారి ఊరేగింపు కోసం అష్ట వాహనాలు, ప్రాకారంలో షెడ్డు నిర్మాణం, పూజారులు, అర్చకులు ఉండేందుకు ప్రత్యేక గదులు, ఆలయంలో ఆహ్లాదం పంచేందుకు గ్రాస్ ఏర్పాటు, కింది నుంచి కొండకు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సు, రథం ఏర్పాటుతో పాటు ఆలయానికి వెళ్లే సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చుతున్నారు. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సీఎం, స్పీకర్‌కు కృతజ్ఞతలు
బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. సమైక్య పాలనలో రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని ఆలయాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి.
నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
బీర్కూర్ మండల శివారులోని కొండపై ఓ భక్తుడు చిన్న ఆలయం నిర్మించగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబీకుల ప్రత్యేక కృషితో ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్పీకర్ పోచారం విన్నపం మేరకు 2017 నవంబర్ 25 వ తేదీన బాన్సువాడ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాభివృద్ధి కో సం సీఎం కేసీఆర్ మొదటి విడుతగా రూ.13 కోట్ల నిధులను మంజూరు చేశారు. అనంతరం ఈ ఏడాది నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో మొట్ట మొదటి జీవోను తెలంగాణ తిరుమల తిరుపతి అభివృద్ధి కోసం మరో రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశారు.