కామారెడ్డి, అక్టోబర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నిబంధనలను పాటించకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాల మధ్య, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టకుండా పెద్ద ఎత్తున పటాకులు విక్రయిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కానరాని అనుమతులు…
పటాకులు దుకాణం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్, రెవెన్యూ, ఫైర్, పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ. 500 చలానా కట్టి అగ్నిమాపక శాఖకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అనుమతులు వచ్చిన తర్వాత జనావాసాలకు దూరంగా సరైన వసతులు ఉన్న గోదాములను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ఒకే చోట లక్షలాది రూపాయల విలువచేసే పటాలకులను నిల్వ ఉంచడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
యథేచ్ఛగా విక్రయాలు..
పటాకుల దుకాణాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు రాకు న్నా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో ఇప్పటికే తాత్కాలిక షెడ్లు వేసుకొని పటాకుల విక్రయాలను ప్రారంభించారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా కొందరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రం లో 30కి పైగా దుకాణాలు ఏర్పాటుకాగా, అగ్నిమాపక శాఖకు 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో నాలుగు దుకాణాలకు తాత్కాలిక అనుమతులిచ్చారు. మరో 13 దరఖాస్తులు ఉన్నతాధికారులకు పంపించారు. డిగ్రీ కళాశాల మైదానంలో దాదాపు 20, సిరిసిల్ల రోడ్, నేషనల్ హైవే తదితర ప్రాంతాల్లో పదికి పైగా దుకాణాలు వెలిశాయి. పటాకుల వ్యాపా రం చేసేవారు ప్రభుత్వానికి కమోడిటీ (సున్నిత వస్తువు) పన్ను చెల్లించాల్సి ఉంటుంది, కానీ చా లా మంది ఎగవేస్తున్నారు. బిల్లులు, వేబిల్లులు లేకుండానే పటాకులను తరలిస్తున్నారు.
నిబంధనలు పాటిస్తేనే అనుమతి..
నిబంధనలను పాటిస్తేనే పటాకుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తాం. 2 ఫైర్ డ్రై కెమికల్ పౌడర్ బాక్సులు, 2 ఇసుక, 2 వాటర్ బకెట్లు, 2 వాటర్ బ్యారల్స్ తప్పకుండా అందుబాటులో ఉంచుకోవాలి. రేకుల షెడ్లలోనే పటాకులను విక్రయించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-దత్తు, ఫైర్ ఆఫీసర్, కామారెడ్డి