కామారెడ్డి టౌన్, నవంబర్ 10 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డిలో 147, బాన్సువాడలో 130, ఎల్లారెడ్డిలో 63 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని చెప్పారు. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా ఆర్డీవో, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ఈనెల 23న నామినేషన్ల స్వీకరణ, 26న విత్ డ్రా, డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. అంతకు ముందు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల సూపరింటెండెంట్ భుజంగరావు,అధికారులు పాల్గొన్నారు.