వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్తాయో ఉహించలేం.. ఏ తెగులు ఎప్పుడు, ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంతనష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు. చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి.
కామారెడ్డి, డిసెంబర్ 2 : కామారెడ్డి జిల్లాలో అంతరపంటల సాగుకు ఈ ప్రాంత నేలలు అనుకూలంగా ఉండడంతో ఆ దిశగా రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఒక పంటతో నష్టపోతే రెండో పంట ద్వారానైనా ఆదాయం పొందేందుకు అంతర పంటల సాగు చేస్తున్నారు. గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్ తదితర మండలాల్లో ఎక్కువగా నల్లరేగడి భూములతో పాటు చెలక, తరక, దుబ్బ భూములుంటాయి. ఈ భూముల్లో కేవలం వర్షాధార పంటలను సాగు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మక్కజొన్న, కంది, మినుము, పెసర, జొన్న తదితర పంటలను సాగు చేస్తారు. ఒక పంటలో మరో పంటగా వేర్వేరు సాళ్లలో వేస్తున్నారు. నల్లరేగడి భూములో ్ల పత్తి, మక్కజొన్న, సోయా, మినుము, పెసర పంటలను ప్రధానంగా సాగు చేస్తుంటారు. అంతర పంటలు కేవలం 90 రోజులో చేతికి వస్తాయి. ఈ రకం పంటలను సాగుచేసే రైతులు ప్రధానంగా కంది పంటను వేసుకోవడం అనుకూలంగా ఉంటుంది.
బహుళ ప్రయోజనాలు…
ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట అయినా చేతికి వస్తుంది. భూమిలో పోషకాల వినియోగం తగ్గుతుంది. కలుపు బెడద తప్పుతుంది. నేలకోతకు ఆస్కారం ఉండదు. భూసారాన్ని కాపాడుకోవచ్చు. నత్రజని శాతం పెరుగుతుంది. పప్పుధాన్యాల సాగుతో భూసారాన్ని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. సహజవనరులను ఎక్కువ మొత్తంలో వినియోగించుకోవచ్చు. ఎరువుల వినియోగం తగ్గుతుంది. ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు.
సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అంతర సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడతాయి. పంటలకు అవసరమైన భూములో ్లరెండు రకాల సాగుతో దీర్ఘకాలిక పంటల మధ్య స్వల్పకాలిక పంటలు వేసుకోవచ్చు. దీంతో మొదట అంతర పంట సాగు ద్వారా వచ్చిన ఆదాయం రెండో పంట పెట్టుబడికి సహాయ పడుతుంది. అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాల పరిమితులు ఉన్న పంటలు, పప్పు జాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. ఉదాహరణకు కంది, మక్కజొన్న పంటలను ఒకేసారి సాగు చేసుకోవచ్చు. ప్రధాన పంట ఆంతరపంటలపై ఒకే రకమైన తెగులు వ్యాపించే అవకాశం ఉంటే సాగు చేయకపోవడమే మంచిది. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అంతరపంట నివారించగలిగేలా చూసుకోవాలి. చీడపీడల తాకిడిని దృష్టిలో పెట్టుకొని పంటలను ఎంపిక చేయాలి. పత్తి పంటలో పెసర, మినుములు, బెండ, సోయా చిక్కుడు వంటి పంటలు సాగు చేసుకోవచ్చు.
కంది పంట ప్రత్యేకత ఇది..
వేరుశనగ, ఆముదం,జొన్న, పెసర, మినుములో అంతర పంటగా కంది సాగుకు అనుకూలం. పత్తిలో అంతర పంటగా సోయా చిక్కుడు, కంది, ఆముదంలో అంతర పంటగా వేరుశనగ పంటలు సాగు చేసి లాభాలు పొందవచ్చును. అంతర పంటల్లో కందికి ప్రత్యేకత ఉన్నది. వీటి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి చొచ్చుకుపోతాయి. తేమను, పోషకాలను లోపలి పొరల నుంచి తీసుకుంటాయి. సాగులో సేంద్రియ ఎరువులనే వాడాలి. నిర్దేశిత మోతాదులోనే విత్తనాలు వేయాలి. పోషకాల ఆవశ్యకత, భూసారాన్ని బట్టి ఎరువులు వినియోగించాలి. కీలక సమయాల్లో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి అందుబాటులో ఉంచాలి. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కంది పంట లాభదాయకమే. అంతరపంటలతో కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు.
అంతరపంటగా పప్పుధాన్యాలు
పప్పు ధాన్యాల పంటలు రాల్చిన ఆకులు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పప్పు ధాన్యాల పంటలు వాతావరణంలోని నత్రజనిని రైజోబియం వేరుబుడిపెల ద్వారా స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. అంతర పంటలుగా వేరుశనగలో అలసంద, పొద్దుతిరుగుడు సాగు చేస్తే ఆకుముడత తెగులు ఉధృతి ఉండదు. సజ్జ సాగు చేస్తే కుళ్లు తెగులు బెడద ఉండదు. వేరుశనగలో ధనియాలు వేస్తే శనగ పచ్చపురుగు బాధ ఉండదు. పత్తిలో వేరుశనగ, ఆలసంద, పెసర, సోయా చిక్కుళ్లు సాగు చేస్తే మిత్రపురుగుల సంఖ్య పెరిగి శనగ పచ్చ పురుగును కట్టడి చేయవచ్చు.
రెండు పంటలతో అధిక ఆదాయం..
రెండు పంటలతో అధిక ఆదాయం ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల తక్కువగా వాడే అవకాశం ఉండడంతో ఖర్చు తగ్గుతుంది. ఒక పంట దెబ్బతిన్న మరోపంట ద్వారా ఆదాయం పొందవచ్చు. పప్పుధాన్యాలు, దుంపల సాగుతో భూమి సారవంతంగా ఉంటుంది. రైతులకు ఎక్కువగా కూరగాయలు, వేరుశనగ, ఆయిల్ పామ్ తదితర పంటలుగా సాగుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
-భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిణి