కేపీహెచ్‌బీకాలనీ, జూలై 14 : కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో కల్తీకల్లు ఘటనలో మరణాల సంఖ్య 9కి చేరింది. కేపీహెచ్‌బీకాలనీ సెక్టార్ ఎస్సై మన్యం వివరాల ప్రకారం.. పుట్టి బసవయ్య, గంగామణి (40) దంపతులు హైదర్నగర్కాలనీలో నివసిస్తున్నారు. గంగామణి హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంది. ఈనెల 6న సాయంత్రం హైదర్‌నగర్‌లోని కల్లు డిపోలో కల్లు తాగింది. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి వాంతులు, విరేచనాలు కావడంతో ఆమెను సమీపంలోని పూజా దవాఖానకు, తర్వాత బాచుపల్లిలోని మమతా దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించగా, చికిత్స పొందుతూ గంగామణి ఆదివారం రాత్రి మృతిచెందింది. దీంతో మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కల్తీ కల్లు బాధితులు గాంధీలో 16మంది, నిమ్స్‌లో 27మం ది చికిత్స పొందుతున్నారు. గడిచిన వారంరోజుల్లో కల్తీ కల్లు తాగి 9మంది మరణించినా.. ఇప్పటికీ ప్రభుత్వం మృతులను గుర్తించడంగాని, వారి వివరాలను అధికారికంగా వెల్లడించడం గాని చేయకపోవడం గమనార్హం.