నేడు రాజకీయ చర్చల్లో కాళేశ్వరం అనే పదం వినిపించిన ప్రతిసారీ చాలా మంది ప్రజల మనసులో ఒకే చిత్రం కనిపిస్తున్నది-మేడిగడ్డ బరాజ్. ఇదే ఈ చర్చలో అత్యంత పెద్ద అపోహ. ఎందుకంటే కాళేశ్వరం అంటే కేవలం ఒక బరాజ్ కాదు, ఒక ఆనకట్ట కాదు, ఒక గేటు కాదు, ఒక పంప్‌హౌస్ కాదు. వందల కిలోమీటర్ల మేర విస్తరించిన, అనేక బరాజ్‌లు, భారీ పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల్లు, పైప్లైన్లు, గ్రావిటీ కాలువలు, విద్యుత్తు వ్యవస్థలు, నియంత్రణ యంత్రాంగం కలిసి పనిచేసే సమగ్ర జల నిర్వహణ వ్యవస్థ.
ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కాళేశ్వరంపై జరిగే చర్చ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది. ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తిందని మొత్తం కాళేశ్వరం వ్యవస్థ నిరుపయోగమైందని ప్రకటించడం కూడా సాంకేతికంగా, పరిపాలనాపరంగా సరైన విశ్లేషణ కాదు. చాలామందికి కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అనే అభిప్రాయం ఏర్పడటానికి ప్రధాన కారణం గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ప్రచారం. కానీ వాస్తవానికి కాళేశ్వరం అనేది మేడిగడ్డ (లక్ష్మీ బరాజ్), అన్నారం (సరస్వతీ బరాజ్), సుందిళ్ల (పార్వతి బరాజ్)తో ప్రారంభమై, అక్కడి నుంచి అనేక దశల్లో నీటిని ఎత్తిపోస్తూ శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి, గంధమల్ల వంటి అనేక రిజర్వాయర్లకు తరలించే బహుళ దశల జలవ్యవస్థ. దీనికి అనుసంధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లలో కొన్ని నిర్మితమయ్యాయి. వేల మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యంతో పనిచేసే పంపింగ్ వ్యవస్థలు, భారీ సర్జ్‌పూల్స్, వందల కిలోమీటర్ల టన్నెళ్లు, కాలువలు ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలుస్తాయి. ఈ నిర్మాణాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఒక బరాజ్‌ను మాత్రమే కాళేశ్వరంగా చూపించడం ప్రజలకు అసంపూర్ణ చిత్రాన్ని చూపించినట్లే అవుతుంది. కాళేశ్వరం ఒకే డ్యామ్ కాదు; ఒకే బరాజ్ కాదు; ఒకే కాలువ కాదు. గోదావరి నది ప్రవాహాన్ని వివిధ దశల్లో నియంత్రిస్తూ, ఎత్తిపోస్తూ, నిల్వ చేస్తూ, మళ్లీ ముందుకు తరలిస్తూ పనిచేసే బహుళ భాగాల సమన్వయ వ్యవస్థ. అందుకే కాళేశ్వరాన్ని ఒకే నిర్మాణంతో పోల్చడం కంటే, మొత్తం జల రవాణా నెట్‌వర్క్‌గా చూడాలి. ఈ సాంకేతిక బేధాన్ని ప్రజలకు వివరించకుండా కేవలం రాజకీయ నినాదాలకే పరిమితం చేయడం వల్ల అసలు చర్చ దారి తప్పుతున్నది. గోదావరి వరదకాలంలో సముద్రంలో కలిసిపోయే నీటిలో కొంత భాగాన్ని నిల్వ చేసి, అవసరమైనప్పుడు ఎత్తిపోసి తెలంగాణలోని నీటి కొరత ప్రాంతాలకు అందించడం. సహజ ప్రవాహం ద్వారా చేరని ఎత్తైన ప్రాంతాలకు నీటిని పంపించడం. సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువుల నింపుదల వంటి బహుళ లక్ష్యాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
కాళేశ్వరం నిర్మాణం వెనుక ఉన్న లక్ష్యం కేవలం కొత్త ప్రాజెక్టు నిర్మించడం కాదు. గోదావరి జలాలను భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా నిల్వ చేసి, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు వంటి అనేక అవసరాలకు ఒకే వేదికను సృష్టించడం. అందుకే దీనిని బహుళ ప్రయోజనాల ప్రాజెక్టుగా పేర్కొంటారు.
తెలంగాణలో కాకతీయుల కాలం నుంచే గ్రామీణ జీవనానికి వేలాది చెరువులు ఆధారం. అయితే వాటిని నింపే సహజ ప్రవాహాలు క్రమంగా తగ్గిపోవడంతో అనేక చెరువులు నిర్జీవంగా మారాయి. కాళేశ్వరం ద్వారా అవసరమైన సమయంలో చెరువులకు నీటిని అందించే అవకాశం ఏర్పడింది. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే బోర్లు నిలబడతాయి. బోర్లు నిలబడితే రైతు విద్యుత్తు ఉన్న సమయంలోనే కాకుండా, అవసరమైన సమయంలో కూడా సాగు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక వ్యవసాయ చక్రాన్ని మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే అంశం. తాగునీటి భద్రత కూడా కాళేశ్వరం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
కాళేశ్వరం విషయంలో భావోద్వేగాలు, రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణల కంటే వాస్తవాలు, శాస్త్రీయ విశ్లేషణ, ప్రజా ప్రయోజనాలే చర్చకు కేంద్రబిందువుగా మారినప్పుడే సమాజం సరైన నిర్ణయానికి రావచ్చు. కాంగ్రెస్ సర్కార్‌కు గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే హక్కు ఉన్నది. అదే సమయంలో ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులను కాపాడే బాధ్యత కూడా ఆ ప్రభుత్వానిదే. ఒకవేళ ఎక్కడైనా లోపాలు నిరూపితమైతే బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి. కానీ ఇప్పటికే నిర్మించిన మౌలిక వసతులను నిరుపయోగంగా మార్చడం, వాటిని రాజకీయ ప్రతీకగా చూడడం, ప్రజల్లో అపోహలు పెంచడం వల్ల రాష్ర్టానికే నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతాయి.. రాజకీయ పార్టీలు మారుతాయి. కానీ చెరువులు, కాలువలు, ఆనకట్టలు, రిజర్వాయర్లు తరతరాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తులు.