వెంకటాపూర్, సెప్టెంబర్ 15: లైంగికదాడి బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు ఆదివారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పెరుకపల్లికి చెందిన 60 ఏండ్ల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన మాదం శివకుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులు దాటినా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
పోలీసులు పట్టించుకోవడం లేదని జిల్లా ఎస్పీ శబరీశ్ను కలిసేందుకు వెళ్తున్న 200 మంది గ్రామస్థులను పోలీసులు తాళ్లపాడు వద్ద అడ్డగించారు. ఆగ్రహించిన గ్రామస్థులు వెంకటాపూర్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడు గ్రామంలో తిరుగుతూ సాక్ష్యం చెప్తే చంపుతానని బెదిరిస్తున్నాడని, అయినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. ఎస్సై జక్కుల సతీశ్ గ్రామస్థులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేదు. దీంతో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై సీఐని వివరణ కోరగా.. నిందితుడిని 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు.