జోగులాంబ, గద్వాల : సుమారు నాలుగు దశాబ్దాలుగా నడిగడ్డలో రైతులు పత్తి సీడ్‌ను ( Cotton Seed Farmers) ఉత్పత్తి చేస్తున్నారు. రైతులకు విత్తనాలు ఇచ్చిన కంపెనీలు( Companys ) , సీడ్ అర్గనైజర్లు కోట్లరూపాయలకు పడగలెత్తారు. కానీ రైతులు మాత్రం పత్తి చేనుకు వాడే మందులు తాగి ఆత్మహత్యలు( Suicide ) చేసుకుంటున్నారు. కారణం రైతులను విత్తన కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి నిలువు దోపిడి చేస్తున్నారు. ఈ తంతు గత 40 ఏళ్లుగా కొనసాగుతున్నది. వీరి దోపిడీ ఈ మధ్య మరీ ఎక్కవయింది.
రైతులతో కంపెనీలు విత్తనాలు ఇచ్చే సమయంలో చేసుకున్న అగ్రిమెంటును పక్కనపెట్టి పండిన పంటలో 2క్వింటాలు మాత్రమే కొంటామని చెబుతున్నారు. రైతులు పంట వేసి ఇప్పటికే రెండనెలలైంది. మద్యలో కంపెనీలు మాట మార్చి మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్ పత్తి కంపెనీ దోపిడికి నిరసనగా గురువారం జోగులాంబ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీతోపాటు పాలమూరు అధ్యయన వేదిక, నడిగడ్డ హక్కుల పోరాట సమితి, బీజేపీ, సీపీఎం పార్టీలు ఈ ధర్నాకు మద్దతు తెలిపాయి. రైతులతో సీడ్ కంపెనీలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ధర ఇచ్చి మొత్తం పంటను కొనేటట్లు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ధర్నాకు మద్దతు ప్రకటించిన నేతలు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.