హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల మ్యానిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ధ్వజమెత్తారు. హమాలీల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి మోసగించిన ఆ పార్టీకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ఆటో యూనియన్, హమాలీ సంఘం, గిగ్ వర్కర్స్ ప్లాట్‌ఫామ్, స్ట్రీట్ వెండర్స్, వాటర్ వర్క్స్, స్కూల్స్ వ్యాన్స్ యూనియన్ల రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, శ్రీనివాస్, నగేశ్, సతీశ్, లక్ష్మణ్, రవీందర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే కార్మికవర్గానికి న్యాయం జరిగిందని చెప్పారు. అడగకుండానే అంగన్వాడీలు, హోంగార్డులు, ఆశ కార్యకర్తలు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. ఆ తర్వాత గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కార్మికవర్గాన్ని అడుగడుగునా దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని, స్ట్రీట్ వెండర్స్‌కు స్పెషల్ జోన్లు ఏర్పాటు చేస్తామని, ఆటోవాలాలకు ప్రతినెలా రూ.1,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పి ఆచరణలో మొండి చెయ్యిచూపుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని కార్మిక సోదరులకు పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. బూటకపు హామీలతో మోసగించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ఈ ఉప ఎన్నిక సరైన అవకాశమని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు ఐక్యంగా బుద్ధి చెప్తామని వీధి వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌గౌడ్ ప్రకటించారు. కార్మిక వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌లో బొంద పెట్టాలని వాటర్ వర్క్స్ యూనియన్ రాష్ట్ర సలహాదారు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొడతామని స్కూల్స్ వ్యాన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.