Allahabad High Court : 1942 ఆగస్టు 9న జరిగిన హత్య కేసు (Murder case) లో దోషిగా తేలిన 100 ఏళ్ల వృద్ధుడికి దాదాపు 42 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత న్యాయం దక్కింది. హత్య కేసులో అతడిని నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో 1982 ఆగస్టు 9న గుణ్వ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఓ భూవివాదం విషయంలో గొడవ జరగడంతో మైకూ అనే వ్యక్తి గుణ్వను కాల్చిచంపాడు. ధనీరామ్, సతిదన్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు కూడా శత్రువు అయిన గుణ్వను చంపేందుకు మైకూను రెచ్చగొట్టారని దర్యాప్తులో తేలింది. దాంతో మైకూను హత్యకు పురికొల్పారనే నేరం కింద పోలీసులు ధనీరామ్, సతిదిన్ను అదుపులోకి తీసుకున్నారు. మైకూను విడిచిపెట్టారు.
ఈ కేసు విచారణ అనంతరం స్థానిక కోర్టు నిందితులు ఇద్దరికీ జీవితఖైదు విధించింది. దాంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు 1984లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. అయితే విచారణ పెండింగ్‌లో పడటంతో ధనీరామ్, సతిదిన్ బెయిల్‌పై బయటికి వచ్చారు. కేసు పెండింగ్‌లో ఉండగానే కొన్నేళ్ల క్రితం సతిదిన్ మరణించాడు.
అయితే సతిదిన్, ధనీరామ్ వేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మైకూను అరెస్టు చేయకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. ధనీరామ్ అప్పీల్‌పై నిర్ణయంలో అసాధారణ జాప్యం, ప్రాసిక్యూషన్‌లో లోపాలను ఎత్తిచూపింది. కేసులో దర్యాప్తులో లోపాలు, ధనీరామ్ వయస్సు 100 దాటడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది.