కాఠ్మాండూ : భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై గత రెండు, మూడు రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి కొనుగోలు చేసే రూ.100 పైబడిన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించడాన్ని సామాన్యులు తప్పు పడుతున్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు అత్యవసరాల కోసం భారత్‌పై ఆధారపడతారని చెప్పారు. మరోవైపు విద్యార్థి సంఘాలను పట్టించుకోకుండా వాటిపై నిషేధం విధించినందుకు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్‌లోని వేలాది మంది విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం కొన్ని వీడియోల్లో కనిపించింది. నిరసనల తీవ్రత పెరుగుతుండటంతో బాలెన్ షా సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతున్నది.
ప్రజల అసంతృప్తి విస్తృత రాజకీయ సవాల్‌గా పరిణమించింది. ఇంకోవైపు దేశ హోం మంత్రి సుధన్ గురుంగ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, అనుమానాస్పద లావాదేవీల్లో పాల్గొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఓ వ్యాపారి కంపెనీల్లో ఆయనకు షేర్లు ఉన్నాయని తెలియడంతోనే ఆయన రాజీనామాకు సొంత పార్టీ నుంచే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిగేందు కోసం తాను రాజీనామా చేసినట్టు బుధవారం ఫేస్బుక్ పోస్ట్‌లో గురుంగ్ తెలిపారు. ఆర్థిక శాఖ ఈ ఆరోపణలపై విచారణ చేస్తుందని చెప్పారు. అధికారం స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులు, మాజీ ప్రధానుల అరెస్టుతో వార్తల్లో నిలిచిన ఆయనపై కొన్ని వారాలకే అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు రావడం గమనార్హం.