అంటిగ్వా: బౌలర్ల చేతుల నుంచి విడుదల కాగానే రాకెట్లా తల మీదకు దూసుకొచ్చే బంతులను చూసి బ్యాటర్లు బెంబేలెత్తారు. అస్థిర బౌన్స్ కారణంగా ఒకరిద్దరి తలలకు గాయాలు కూడా అవడంతో మ్యాచ్‌ను ఉన్నఫళంగా రద్దు చేసిన ఘటన వెస్టిండీస్‌లో చోటుచేసుకుంది. దేశవాళీ క్రికెట్లో భాగంగా వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో అంటిగ్వాలోని సర్ వివిన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ట్రినిడాడ్ అండ్ టొబాగొ, లీవర్డ్ ఐలాండ్స్ మధ్య నిర్వహించిన మ్యాచ్‌లో పిచ్ ప్రమాదకరంగా స్పందించింది. పేసర్లు బంతిని సంధించడమే తరువాయి అన్నట్టుగా అది నేరుగా బ్యాటర్ల తలలను టార్గెట్ చేసింది. మూడో రోజు ఉదయం సెషన్లో విండీస్ టెస్టు బౌలర్ జైడన్ సీల్స్ వేసిన బంతి.. జెర్మియా లూయిస్ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పికి తాళలేక విలవిల్లాడుతూ కిందపడిన అతడు.. అసహనంగా లేచి పక్కనే కిందపడి ఉన్న హెల్మెట్‌ను తన్నేశాడు. గాయంతోనే మైదానాన్ని వీడిన అతడు ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. లూయిస్ గాయం అనంతరం మ్యాచ్‌ను రద్దుచేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. క్రికెట్ వెస్టిండీస్ కూడా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ పిచ్ ప్రమాదకరంగా ఉండటంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను రద్దుచేశామని తెలిపింది.