హూస్టన్: సౌరమండలంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. ఆ గ్రహానికి చెందిన స్టన్నింగ్ వీడియోను నాసా రిలీజ్ చేసింది. జ్యూపిటర్ మీదకు పంపిన జూనో మిషన్‌కు చెందిన కెమెరాలకు ఆ గ్రహం అత్యంత అద్భుతంగా చిక్కింది. ఏప్రిల్ 9వ తేదీన సుమారు 32000 కిలోమీటర్ల దూరం నుంచి గురుగ్రహాన్ని జూనో కెమెరాలు షూట్ చేశాయి. గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జూనో స్పేస్‌క్రాఫ్ట్ ఈ వీడియోను చిత్రీకరించింది. బృహస్పతికి చెందిన దక్షిణ ద్రువాన్ని ఈ వీడియోలో షూట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గురుగ్రహానికి మరింత దగ్గరగా జూనో వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 ఆగస్టులో జూనో స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగికి పంపారు. అయిదేళ్ల ప్రయాణం తర్వాత అది 2016 జూలైలో జ్యూపిటర్ వద్దకు చేరుకున్నది. 2025 వరకు ఈ మిషన్ పనిచేయనున్నది.