– ప్రేమించలేదనే ఉన్మాదం
– సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద నిందితుడు పవన్ అరెస్ట్
– కేసు వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ
జూలూరుపాడు, అక్టోబర్ 01 : ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఎనిమిదేళ్లుగా వెంటతిరిగిన యువతి తనను దూరం పెడుతోందని కక్ష పెంచుకున్నాడు. ఏకంగా బైక్ గేర్ వైరుతో గొంతు బిగించి కిరాతకంగా హతమార్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పవన్ కుమార్ ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండడంతో హరిణి ఇటీవల అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది.
పవన్ కుమార్ ప్రవర్తన సరిగా లేనందున తమ కూతురు హరిణిని ఇచ్చి పెళ్లి చేయలేమని ఆమె కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. అయినా పవన్ తీరు మారలేదు. తరచూ ఆమె వెంటపడుతూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన హరిణి, అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను సైతం మార్చేసింది. తనను పూర్తిగా దూరం పెడుతోందన్న అక్కసుతో పవన్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో వెంగన్నపాలెంలోని హరిణి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తనను ఎందుకు కాదంటున్నావని నిలదీశాడు. ఆమె ఎంతకీ అంగీకరించకపోవడంతో ఆవేశానికి గురైన పవన్ తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైరుతో హరిణి మెడకు గట్టిగా బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న మెట్ల పక్కన సందులో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.
కూతురు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు జూలూరుపాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో యువతి మెడకు వైరు లాంటిది బిగించి చంపినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు.
నిందితుడు పవన్ కుమార్ తన గ్లామర్ బైక్‌ను ఒంటిటిగుడిసె రోడ్డులోని సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. అక్కడి నుండి నేరుగా విశాఖపట్నం పారిపోయాడు. ఆ తర్వాత తిరుపతి వెళ్లి, అక్కడినుంచి తిరిగి ఖమ్మం చేరుకున్నాడు. వేరే ప్రాంతానికి వెళ్లి రాపిడో నడుపుకుంటూ బతుకుదామన్న ఉద్దేశంతో, తాను దాచిపెట్టిన బైక్ తీసుకునేందుకు జూలూరుపాడు వచ్చాడు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు, ప్రాజెక్ట్ కాల్వ వద్ద బైక్ తీసుకునేందుకు వచ్చిన నిందితుడు పవన్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడి నుండి హత్యకు ఉపయోగించిన బైక్ గేర్ వైర్, ఒక గ్లామర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, హత్య సమయంలో నిందితుడు ధరించిన షర్ట్‌ను సీజ్ చేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన జూలూరుపాడు పోలీసు సిబ్బందిని డీఎస్పీ ఆదినారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ జీనత్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.