హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూలకంటి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేస్తున్నారని, వాటిని 25 లక్షల ఎకరాలకు పెంచాలని రైతాంగం కోరుతున్నా అవసరమైన నిధుల కేటాయింపు లేదని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడుదామని జూలకంటి పిలుపునిచ్చారు. రైతులు వానకాలం పంటలు వేస్తున్నా వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయలేదని జూలకంటి పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పీ జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు పాల్గొన్నారు.