హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ గ్రూపు నుంచి బీసీ ‘ఏ’ గ్రూపులోకి మార్చాలని క్రీడలు, పాడి పరిశ్రమల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. గురువారం పలువురు ముదిరాజ్ ప్రతినిధులతో కలిసి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను ఖైరతాబాద్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముదిరాజ్‌ల జనాభా 26,39,027ఉన్నదని, మొత్తం జనాభాలో 7.4 శాతంగా తేలినదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూడో అతిపెద్ద సామాజికవర్గంగా, బీసీల్లో రెండో పెద్ద కులంగా నిర్ధారించినట్లు తెలిపారు. ముదిరాజ్ సామాజికవర్గం విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యరంగాల్లో వెనుకబడి ఉన్నదని, మరింత పురోగతి సాధించాల్సిన అవసరమున్నదని మంత్రి స్పష్టం చేశారు. బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’లోకి మారిస్తే భావితరాలకు న్యాయం జరుగుతుందని, ఆ దిశగా బీసీ కమిషన్ చైర్మన్ చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీహరి కోరారు. మంత్రి వెంట ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కాసాని వీరేశ్, బలరామ్ తదితరులున్నారు.