హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎల్ఎల్బీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. ఒకే షెడ్యూల్లో ఉస్మానియా ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు, తెలంగాణ హైకోర్టు ఉద్యోగ పరీక్షలు ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొన్నది. ఈ రెండూ ముఖ్యమైనవే కావడం, రెండు పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టులో ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ వంటి ఉద్యోగాల భర్తీకి ఈ నెల 24 నుంచి 28 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఈ నెల 18 నుంచి జూలై 3 వరకు ఎల్ఎల్బీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షలున్నాయి. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకొన్న లా విద్యార్థులు ఆ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో ఓయూ లా సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఒకే సమయంలో రెండు పరీక్షలు ఉండటంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఏ పరీక్షలు రాయాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారులు స్పందించి ఓయూ లా సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.