బంజారాహిల్స్, ఫిబ్రవరి 4 : జూబ్లీహిల్స్ రోడ్ నం.32లోని సుమారు రూ.300 కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కులో ఆక్రమణలు తొలగినా యూబీడీ విభాగం అధికారులు మాత్రం నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు. ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో జీహెచ్ఎంసీ పార్కులో ప్రైవేటు వ్యక్తులు చేసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించి సుమారు 20 రోజులు గడిచాయి. మూడున్నర ఎకరాల పార్కు స్థలంలో 70 శాతం స్థలాన్ని ఇద్దరు బడాబాబులు చెరబట్టిన సంగతి తెలిసిందే.
పార్కును అభివృద్ధి చేస్తున్నామనే నెపంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనే అత్యంత ప్రముఖమైన విద్యాసంస్థలకు చెందిన యజమాని పార్కులోని దక్షిణ భాగంలో సుమారు ఎకరన్నర స్థలాన్ని ఫామ్‌హౌస్ తరహాలో తయారు చేసుకున్న వైనంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా పార్కులోని తూర్పు వైపు సైతం రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి వియ్యంకుడు సుమారు ఎకరం స్థలాన్ని సొంతానికి వాడుకోవడంతో పాటు ఏకంగా సర్వెంట్స్ కోసం గదులు నిర్మించగా, వాటిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చేశారు. మంత్రికి చెందిన వియ్యంకుడు నిర్మించిన సర్వెంట్స్ రూమ్స్‌ను కూడా కూల్చేశారు. అయితే తమ బంగ్లాలనుంచి పార్కులోకి వచ్చేందుకు ఏర్పాటు చేసిన గేట్లను తొలగించాలని, అక్కడ గోడ నిర్మించాలంటూ హైడ్రా అధికారులు యూబీడీ విభాగం అధికారులను ఆదేశించినా ఇప్పటిదాకా ఆ పనిచేయలేదు.
కనీసం రోజువారీ క్లీనింగ్ పనులు, మొక్కలకు నీళ్లు పోసే పనులు సైతం ప్రారంభించలేదు. మంత్రిగారి వియ్యంకుడి ఒత్తిడితోనే పార్కు నిర్వహణ జోలికి రావడంలేదని, పార్కు స్థలాన్ని మరోసారి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. ఖరీదైన జీహెచ్ఎంసీ పార్కును అన్యాక్రాంతం కాకుండా చూడాలని, తక్షణమే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి పార్కు నిర్వహణను గాడిలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.