సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొందరు పోలీసు సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరిని బదిలీ చేసినప్పటికీ ఇటీవల కమిషనరేట్ల పునర్విభజన తర్వాత సిటీ పోలీసు పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ల బదిలీలు భారీగా జరిగాయి. ఇందులో సుమారు 90 మంది ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ప్రస్తుతం కమిషనర్ అటాచ్‌లో ఉన్నారు. వీరికి 15 రోజులుగా ఎలాంటి బాధ్యతలు లేకుండా ఖాళీగా ఉండడంతో నగర పోలీసింగ్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు నేర నియంత్రణతో పాటు స్టేషన్లలో కీలకమైన విధులు నిర్వర్తించాల్సిన వారే లేకుండా పోతే శాంతిభద్రతల పరిరక్షణ ఇతర పనులు ఎలా జరుగుతాయంటూ పోలీసులే చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే నగర పోలీసు విభాగంలో ఐదో వంతు ఖాళీలు ఉండగా తాజాగా కమిషనర్ ఎటాచ్‌మెంట్‌తో చాలా మంది సిబ్బంది ఖాళీగా ఉంటున్నారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. శాంతిభద్రతలు, ఆర్మ్ రిజర్వ్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీసీఎస్ ఇలా ప్రతీ విభాగంలోనూ కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు వివిధ హోదాల్లో సిబ్బంది ఉండాల్సిన దానికంటే 5,500 మంది తక్కువగా ఉన్నారు. ఖాళీల సమస్య తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కానిస్టేబుళ్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల బదిలీలు జరిగాయి. సిటీ కమిషనరేట్‌లో పనిచేస్తున్న చాలా మంది సిబ్బందిని బదిలీ చేస్తూ కొందరిని కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. గతనెల 18న జరిగిన 54 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలలో 28 మందికి పోస్టింగ్ ఇవ్వగా 26 మందిని కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. ఆ తర్వాత మరోసారి గతనెల 27న జరిగిన బదిలీల్లో 46 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేయగా, అందులో 13 మందిని కమిషనరేట్‌కు ఎటాచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్స్పెక్టర్లలో కొందరికి ఇంకా బాధ్యతలు ఇవ్వలేదని, వీరంతా ఖాళీగా ఉన్నారంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక ఇటీవల జరిగిన ఎస్సైల బదిలీలు, కానిస్టేబుళ్ల బదిలీల్లో సుమారుగా 90మందికిపైగా ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీరందరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో ప్రస్తుతం వారు బదిలీ అయిన స్థానాల్లో చాలావరకు ఖాళీగా ఉన్నాయి.
అసలే నగరంలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ఈ బదిలీలు, సీపీ అటాచ్మెంట్లతో పోలీసింగ్ గందరగోళంగా మారింది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 73 పోలీస్స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండగా, అటాచ్మెంట్లతో చాలా చోట్ల కానిస్టేబుళ్లు, డీఐలు, ఎస్ఐలు లేక నేరస్తుల విచారణ, ఇతర బందోబస్తు విషయంలో స్టేషన్లలో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతున్నది. గతంలో ఎప్పుడూ ఇంతకాలం ఈస్థాయిలో సిబ్బందిని ఖాళీగా ఉంచిన దాఖలాలే లేవని, అసలు కమిషనరేట్ల పునర్విభజన ద్వారా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసు ఉన్నతాధికారులు తమకు సంబంధించిన వారిని తెచ్చుకునే క్రమంలో కమిషనరేట్ల మార్పులో కొంత ఆలస్యం జరుగుతున్నదంటూ పోలీసులు చర్చించుకుంటున్నారు.