న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయంగా విమానాలు ఎక్కేవారు గణనీయంగా పెరుగుతున్నారు. 2025 సంవత్సరంలో దేశీయంగా విమానాలను వినియోగించిన వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన 3 శాతం ఎగబాకి 16.69 కోట్లకు చేరుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. కానీ, డిసెంబర్ నెలలో మాత్రం ప్రయాణికులు 1.43 కోట్లకు పడిపోయారని తాజా నివేదికలో తెలిపింది. గతేడాది చివరి నెలలో భారీగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం ప్రయాణికులు తగ్గడానికి ప్రధాన కారణమని తెలిపింది. దీంతో నవంబర్‌లో 63.6 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా ఆ తర్వాతి నెలలో 59.6 శాతానికి పడిపోయింది.
ఇదే సమయంలో ఇతర సంస్థలు తమ సర్వీసులను పెంచుకోవడంతో వారి మార్కెట్ వాటా అమాంతం పెరిగింది. ఎయిర్ ఇండియా షేరు 29.6 శాతానికి పెరగగా, ఆకాశ ఎయిర్ వాటా 5.2 శాతానికి ఎగబాకింది. గతేడాది ఎయిర్ ఇండియా వాటా 26.7 శాతంకాగా, ఆకాశ వాటా 4.7 శాతంగా ఉన్నది. అలాగే స్పైస్‌జెట్ వాటా 3.7 శాతం నుంచి 4.3 శాతానికి చేరుకున్నది. మొత్తంమీద గతేడాది చివరి నెలలో విమాన సర్వీసుల రద్దు 6.92 శాతంగా ఉండగా, ఒక ఇండిగోకు చెందిన సర్వీసుల వాటా 9.65 శాతంగా ఉన్నది. విమాన సర్వీసులు రద్దుకావడంతో 10.46 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది.
వీరికి ఆయా సంస్థలు 24 కోట్ల రూపాయలను పరిహారం కింద చెల్లింపులు జరిపాయి. 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. డిసెంబర్ నెలలో 29 వేల మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేశారని, వీరిలో అత్యధిక మంది ఫ్లైట్లు సరైన సమయానికి రావడం లేదనే అత్యధిక మంది ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి విమాన సర్వీసులు నడిపిన సంస్థల్లో ఎయిర్ ఇండియా 66.3 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, ఇండిగో 62.7 శాతం, అలైన్స్ ఎయిర్ 62.1 శాతం, ఆకాశ ఎయిర్ 55.6 శాతం, స్పైస్‌జెట్ 46.9 శాతంగా ఉన్నాయి.