హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాలతోపాటు జర్నలిస్టులు పోషించిన క్రియాశీలక పాత్ర అత్యంత విశిష్టమైనదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టులకు ప్రత్యేక మార్గదర్శకాల ద్వారా ఉద్యమకారులుగా అధికారిక గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్మంలో ఏర్పాటుచేసిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల కమిటీ చైర్మన్ కే కేశవరావుకు విజ్ఞప్తులు అందజేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల సేవలు, త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, సంబంధిత కమిటీ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ ఆశాభావం వ్యక్తంచేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అల్లం నారాయణతోపాటు సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, సీనియర్ జర్నలిస్టులు ఓరుగంటి సతీష్, కందుకూరి రమేశ్‌బాబు, సూరజ్, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టెపాక భాస్కర్ తదితరులు ఉన్నారు.