వికారాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్ పార్కుల భూ సేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే బదిలీలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో ఏర్పాటుచేస్తున్న ఎడ్యుకేషన్ హబ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టళ్ల, వెటర్నరీ కాలేజీ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
అనంతరం కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్‌లో అదనపు పంపుల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సెప్టెంబర్‌లోగా భూ సేకరణను పూర్తిచేయాలని సూచించారు. మూడో పంపు ఏర్పాటు పనులపై క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఉన్నతాధికారులు దానకిశోర్, సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్, శ్రీదేవి, శ్రీధర్, శశాంక, కలెక్టర్లు దీపక్ తివారీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.