హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)లో మందులు, సర్జికల్స్, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లో పారదర్శకత పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎంఎస్)అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. టీజీఎంఎస్ఐడీసీ ఈ-ఔషధి పోర్టల్ ద్వారా ఇప్పటికే డ్రగ్స్, సర్జికల్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నది.
పీఎంఎస్ డిజిటల్ టూల్ ద్వారా స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? వినియోగం ఏ మేరకు ఉన్నది? ఎక్కడ అవసరం ఉన్నది? అనే అంశాలను క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేయనున్నారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు సరఫరా అవుతున్న ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ మొత్తం ప్రస్తుతం హార్డ్ కాపీ రూపంలో జరుగుతుండగా ఇకనుంచి పీఎంఎస్ డిజిటల్ టూల్ ద్వారా చేసేలా కసరత్తు చేస్తున్నారు.