హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో నాటి ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్క తెలంగాణ జర్నలిస్టు అప్రమత్తం కావాల్సిన, ఉద్యమ కాలంలో నిర్వర్తించిన పాత్రను కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) పాతికేండ్ల ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ కలయిక జరిగింది. నాటి వ్యవస్థాపకులు సహా, 2001 నుంచి నేటి వరకు టీజేఎఫ్ వేదికగా పనిచేసిన జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులు పెద్దఎత్తున హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి 12 ఏండ్లు ముగిసినందున తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తన తటస్థ వైఖరిని విడనాడి ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని సమ్మేళనానికి హాజరైన జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా, పలు మీడియా చానళ్లు, పత్రికల్లో పనిచేస్తూనే నాటి ఆంధ్రా యాజమాన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం పనిచేసిన తీరు గురించి, వారి వారి అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. తెలంగాణలోని పత్రికలు, చానల్స్‌లో తెలంగాణ ఎడిటర్లే ఉండాలని, తెలంగాణ విడిపోయాక కూడా తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం టీజేఎఫ్ ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు. నూతన రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభు త్వం ఏర్పాటైనా స్వయం పాలనలో నిలదొక్కుకొనే దాకా, పదేండ్లదాకా మద్దతు ప్రకటించాలని నాడు ఎన్నికల ముందే టీజేఎఫ్ చేసిన తీర్మానాన్ని గుర్తుచేశారు. ఆ తీర్మానం గడువు ముగిసిందని ప్రకటించారు. ఇకనుంచి రాబో యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రజాపక్షం వహించి టీజేఎఫ్ ప్రశ్నిస్తుందని పునరుద్ఘాటించారు.
తెలంగాణ సమాజం అనేక పోరాటాల దశలను దాటుకుంటూ ప్రయాణం సాగించిందని సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన అనంతర పాలనాకాలం అనే ఈ సంధికాలాన్ని మరింత అవగాహన చేసుకోవాల్సి ఉన్నదని, చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. అల్లం నారాయణతోపాటు ప్రతిఒక్క ఉద్యమ జర్నలిస్టూ వారి వారి అనుభవాలను గ్రంథస్తం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులుగా టీజేఎఫ్ పాత్ర గొప్పదని కొనియాడారు. తెలంగాణ సమాజం నిత్యం చైతన్యంతో ఉంటుందని, తాను కూడా ఆంధ్రజ్యోతిలో ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు ఉద్యమకారుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా తన అనుభవాలను త్వరలో రికార్డు చేస్తానని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు, అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ ఉద్యమం చల్లబడ్డప్పుడల్లా అన్ని పార్టీలు, ఉద్యమ సంస్థలు, మేధావులను సమన్వయం చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఘనత టీజేఎఫ్దేనని చెప్పారు. నాడు ఒక విప్లవకారుడుగా గన్నుపట్టి, అనంతర కాలంలో పెన్నుపట్టి జర్నలిస్టుగా పనిచేస్తూ, తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ అధ్యక్షుడుగా, రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల నేతగా అల్లం నారాయణ పాత్ర కీలకమని పేరొన్నారు. ప్రపంచ చరిత్రలో ఒక ప్రాంతీయ అస్తిత్వం కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఘనత తెలంగాణ జర్నలిస్టులకే దకుతుందని సీనియర్ జర్నలిస్టు, రచయిత జూలూరి గౌరీశంకర్ తెలిపారు.
తెలంగాణ సాధించుకున్న అనంతర కాలంలో ప్రభుత్వాలను ప్రశ్నించడంలో టీజేఎఫ్ కొంత వెనుకబడి ఉన్నదని, ఇప్పటికైనా మంచిని మంచి, చెడును చెడు అని విమర్శిస్తూ ప్రజాపక్షం వహించాలని సీనియర్ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి సూచించారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ రెచ్చిపోతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల వల్ల తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదంలో పడిందని, తెలంగాణ ద్రోహులను తరిమికొట్టే కీలక పాత్రను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పోషించాల్సిన సందర్భం వచ్చిందని టీ న్యూస్ సీఈవో శైలేశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీజేఎఫ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సమన్వయంతో అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు, ఫ్రీలాన్సర్లు పాల్గొన్నారు.