డెంగ్యూ జ్వర బాధితులు పెరుగుతున్నారు. వీళ్లలో పిల్లలే అధికంగా ఉన్నారు. ఇది దోమకాటు వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ కలిగించే వైరస్‌ని వ్యాప్తి చేసే దోమలు రాత్రి కన్నా పగటి వేళల్లో ఎక్కువగా కుడతాయి. డెంగ్యూ వైరస్ సోకితే మూడు నుంచి అయిదు రోజులు జ్వరం ఉంటుంది. కానీ, డెంగ్యూ లక్షణాలు వెంటనే బయటపడవు. జ్వరం తగ్గిన తర్వాత ఇబ్బందులుంటాయి. పొట్టనొప్పి, వాంతులు, ప్లేట్లెట్స్ తగ్గడం, తెల్ల రక్తకణాల తగ్గుదల, నీరసం, బీపీ తగ్గుదల, ముక్కు కారడం వంటి సమస్యలుంటాయి.
డెంగ్యూ నిర్ధారణ కాగానే పేరెంట్స్ భయపడతారు. పిల్లల్ని హాస్పిటల్లో చేర్చాలా? అని అడుగుతారు. డెంగ్యూ సోకినవాళ్లలో తీవ్రత మూడు రకాలుగా ఉంటుంది. వైరస్ వల్ల డెంగ్యూ జ్వరం మాత్రమే ఉంటుంది. కొందరిలో జ్వరంతోపాటు డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. కొద్దిమందిలో డెంగ్యూ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. డెంగ్యూ లక్షణాలు బయట పడితేనే హాస్పిటల్లో చేర్చాలి. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, నీరసం, తక్కువగా తినడం, మూత్రం సరిగా పోకపోవడం, ఎక్కువ సమయం నిద్ర పోవడం, చేతులు చల్లబడటం వంటి సమస్యలు ఉంటే హాస్పిటల్లో చికిత్స చేయించాలి. డెంగ్యూ తీవ్రంగా ఉంటే ఐసీయూలో చికిత్స అవసరం ఉంటుంది. ఏడాదిలోపు పిల్లల్లో డెంగ్యూ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్లకు డెంగ్యూ సోకిందని తెలియగానే హాస్పిటల్లో చేర్పించాలి.
యాంటీ బయాటిక్స్‌తో డెంగ్యూని తగ్గించలేము. సెకండరీ ఇన్ఫెక్షన్లు ఉంటే యాంటీ బయాటిక్స్ ఇస్తారు. లక్షణాలను బట్టి మందులు, ఫ్లూయిడ్స్ ఇస్తారు. డెంగ్యూ వచ్చిన వాళ్లందరికీ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్స్ని మందులతో పెంచలేము. ప్లేట్స్‌లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉన్న స్థితిని వైద్యులే నిర్ణయించి చికిత్స చేస్తారు. డెంగ్యూ ఇంట్లో ఇకరికి వస్తే వారి నుంచి మరొకరికి వస్తుందనుకుంటారు. అదంతా ఒక అపోహ. కేవలం దోమకాటు ద్వారానే సోకుతుంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్లో డెంగ్యూ బారినపడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.