సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తాగునీటితో ఫ్లోర్లు, వాహనాలు కడగటం, అవసరం లేకున్నా నల్లాలను తెరిచి ఉంచడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిపోయి నీరు పొంగిపోతున్నా పట్టించుకోకపోవడం వంటి చర్యల వల్ల విలువైన తాగునీరు వృథా అవుతున్నదని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఈమేరకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించి జరిమానా విధించారు. ఈసందర్భంగా ఒక్క నిమిషంలోనే ఎంత నీరు వృథా అవుతుందో కరపత్రాల ద్వారా వివరించారు. ఇక నుంచి తాగునీటి వృథాపై జలమండలి కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. నగర వ్యాప్తంగా నీటి సరఫరా సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.