పెద్దపల్లి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంథనిలోని రాజగృహలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణ సంఘానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భగా మధుకర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఈ తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ వంటి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అంధకారమేనని స్పష్టం చేశారు.సాగుకు మూడు గంటలు చాలన్న ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.