సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆఖరిదైన యాషెస్ సిరీస్ ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు గెలిచిన ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది. ఆదివారం మొదలైన ఐదో టెస్టులో హ్యారీ బ్రూక్(92 బంతుల్లో 78 నాటౌట్, 6ఫోర్లు, సిక్స్), జో రూట్(103 బంతుల్లో 72 నాటౌట్, 8ఫోర్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌లో పూర్తి ఓవర్లు పడకుండానే ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్-3 బ్యాటర్లు బెన్ డకెట్(27), జాక్ క్రాలె(16), జాకబ్ బెతెల్(10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 57 పరుగులకే ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ స్థితిలో రూట్, బ్రూక్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. ఆసీస్ బౌలింగ్‌ను ఎదురొడ్డి నిలుస్తూ కీలక పరుగులు జతచేశారు. ఈ క్రమంలో టెస్టుల్లో రూట్ 67వ అర్ధసెంచరీ ఖాతాలో వేసుకోగా, బ్రూక్ తనదైన శైలిలో హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరు మైదానం నలువైపులా క్లాసికల్ షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రయత్నాలు ఫలించలేదు. బ్రూక్, రూట్ ఇద్దరు నాలుగో వికెట్‌కు 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. స్టార్క్ (1/53), నెసెర్ (1/36), స్కాట్ బోలాండ్ (1/48) ఒక్కో వికెట్ తీశారు. 1888 తర్వాత సిడ్నీలో స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండా ఆసీస్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం.